నిజామాబాద్‌లో ఐటీ హబ్!
- రూ.25 కోట్లతో నిర్మాణం: మంత్రి కేటీఆర్ వెల్లడి
- ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరణలో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ పరిశ్రమ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, నిజామాబాద్‌లో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, స్థానిక ఎమ్మెల్యే గణేశ్ గుప్తా అదివారం హైదరాబాద్ బెగంపేటలోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కలసి ఐటీ హబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ 60 కంపెనీలిచ్చిన లేఖలను అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తొలి దశ ఐటీ హబ్ ప్రాజెక్టును రూ.25 కోట్లతో నిర్మిస్తామని వెల్లడించారు. అందులో ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటుందని తెలిపారు. టీఎస్‌ఐఐసీ ద్వారా వచ్చే ఏడాది సకల సదుపాయాలతో ఈ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి అనుకూలతలు నిజామాబాద్ నగరానికి ఉన్నాయని పేర్కొన్నారు. దశాబ్దంన్నర కిందటే జిల్లాలో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయని, పక్కనే ఉన్న బాసర ఐఐఐటీ ద్వారా వేలాది మంది ఇంజనీర్లు రూపుదిద్దుకుంటున్నారన్నారు.
ఎన్నారైలు ముందుకు రావాలి..
ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమ విస్తరణ చర్యల్లో భాగంగా తొలుత చిన్న స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయని కేటీఆర్ తెలిపారు. వందల మంది తెలుగు ఎన్నారైలు విదేశాల్లో అనేక ఐటీ కంపెనీలు పెట్టారని, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు తమ కంపెనీలను విస్తరించేందుకు వారు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున రాయితీలు అందిస్తామని చెప్పారు. ఐటీ హబ్ ఏర్పాటుకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కొంత కాలంగా ప్రణాళిక బద్ధంగా ప్రయత్నం చేశారన్నారు. ఒక వైపు ప్రభుత్వం నుంచి ఐటీ హబ్ ప్రతిపాదన అమోదానికి ప్రయత్నం చేస్తూనే, మరోవైపు స్వయంగా విదేశాల్లోని ఎన్నారైల కంపెనీలతో చర్చలు జరిపారని కొనియాడారు.
విద్యార్థులకు భవిష్యత్ భరోసా: ఎంపీ కవిత
నిజామాబాద్‌లో ఐటీ హబ్ ఏర్పాటు ద్వారా చుట్టుపక్క జిల్లాల యువతకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు, యువతకు వారి భవిష్యత్తు పట్ల ఈ ఐటీ హబ్ భరోసా కల్పిస్తుందని చెప్పారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వారం రోజులపాటు అమెరికాలోని అట్లాంట, న్యూజెర్సీ, డల్లాస్, వాషింగ్టన్, షికాగో నగరాల్లో పర్యటించి ఐటీ హబ్‌లో పెట్టుబడులు పెట్టాలని తెలుగు ఎన్నారైలను కోరామని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తెలిపారు. ఆసక్తి వ్యక్తపరిచిన 60 మంది ఎన్నారైల్లో తెలంగాణేతరులు ఉన్నారని, వారంతా తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చారని చెప్పారు.