
ఇది ప్రతిపక్షాల కుట్ర
- ధర్నా చౌక్ ఘటనపై మంత్రులు నాయిని, తలసాని
- ప్రభుత్వం ధర్నా చౌక్‌ను తరలిస్తామని ఎప్పుడూ అనలేదు
- టీఆర్‌ఎస్ ప్రభుత్వ మంచి పనితీరుతో ప్రతిపక్షాలకు దడ
- కోదండరాం ఎప్పుడూ ఎవరికో ఒకరికి డబ్బా కొట్టాల్సిందేనని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న అక్కసు, కుట్రతోనే ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ధర్నాచౌక్ ఘటనతో ప్రతి పక్షాల పన్నాగం బయట పడిందని వ్యాఖ్యా నించారు. సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యా లయంలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి వారు విలేకరులతో మాట్లాడారు. ధర్నా చౌక్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదని నాయిని పేర్కొన్నారు. ధర్నా చౌక్ ఆక్రమణ పేరుతో విపక్షాలన్నీ కలసి స్థానిక ప్రజలు, పోలీసులపై దాడులు చేశారని ఆరోపించారు.
ధర్నాలను మరో ప్రాంతంలో చేసుకుంటే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారని.. ఆ డిమాండ్‌తోనే శాంతి యుతంగా ధర్నా చేస్తున్న స్థానికులపై ప్రతిపక్షాలు దాడులు చేయడం దారుణ మని వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్ కోసం కోర్టులో పిటిషన్ వేసిన కోదండరాం.. దానిపై తీర్పు రాకముందే ఎందుకు ఉపసంహరిం చుకున్నారని, న్యాయస్థానం మీద గౌరవ ముంటే తీర్పు కోసం ఎదురుచూడాల్సింది కదా అని పేర్కొన్నారు. కోదండరాం అందరినీ రెచ్చగొడుతున్నారని, ఇది ఆయనకు తగదని వ్యాఖ్యానించారు. సీపీఎం, సీపీఐ, మధ్యలో ఎక్కడి నుంచో వచ్చిన జనసేన అంటూ ఆందోళనకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు.
పోలీసులు ఎవరినీ అడ్డు కునే ప్రయత్నం చేయలేదన్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం వచ్చిన తర్వాతే ధర్నా చౌక్ వద్ద విధ్వంసం జరిగిందని.. అనవసరంగా రెచ్చిపోతే చచ్చిపోతారని నాయిని వ్యాఖ్యానించారు. ఎవరో ఒకరి తోక పట్టుకుంటేనే కమ్యూనిస్టులకు బతుకుదెరువు అని ఎద్దేవా చేశారు. ‘‘కోదండరాం ఎవరికో ఒకరికి డబ్బా కొట్టాల్సిందే. మేం పోతే కాంగ్రెస్సో, బీజేపీనో అధికారంలోకి వద్దాయనుకుందాం.. కోదండరాం అయితే రాడుకదా..’అని వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
కక్ష పెంచుకున్నవిపక్షాలు: తలసాని
ప్రతిపక్షాలు ప్రభుత్వంపై కక్ష పెంచు కున్నాయని.. చివరకు సీఎంను కూడా ఏకవచనంతో దూషిస్తున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. ‘సీఎం కేసీ ఆర్‌ను, ఆయన కుటుంబాన్ని దూషిస్తే ప్రజలు మీ నాల్క చీరేస్తరు. ఇలా అయితే చంద్రబాబు గురించి మేం రోజూ మాట్లా డాల్సి వస్తుంది. ధర్నాచౌక్‌కు ఏం సాధిం చారు. ప్రతిపక్షాల ఆస్తులేమైనా గుంజు కున్నామా? భవిష్యత్‌లో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి’ అని విపక్షాలను హెచ్చరిం చారు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వం ఎంతో హుందాగా ఉందన్నారు. పోలీసులను మఫ్టీలో పెట్టాల్సి వస్తే వెయ్యి మందిని పెట్టేవారు కదా అని వ్యాఖ్యానించారు. ప్రజలపై విపక్షాలు దాడి చేయడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ధర్నా చౌక్ ఘటనలో పోలీసులు, ప్రభుత్వం ఎంతో సంయమనం పాటించాయన్నారు. స్థాని కులపై జరిగిన దాడిలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆరోపించారు. చిన్న సమస్యలకే ప్రతిపక్షాలు రాబందుల్లా వాలిపోతున్నాయని మండిపడ్డారు.