సాక్షి, సిటీబ్యూరో : జై బోలో గణేశ్ మహరాజ్‌కీ.. అంటూ భక్తి పారవశ్యంలో భక్తుల జయజయ ధ్వానాలతో ఎన్టీఆర్ మార్గ్(ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్‌వరకు) మార్మోగింది. తొమ్మిది రోజుల పాటు సకల జనుల పూజలందుకున్న బొజ్జగణపయ్యలను బుధవారం సాగరంలో నిమజ్జనం చేసేందుకు వచ్చిన జనప్రవాహంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. ఫ్లడ్‌లైట్ల కాంతుల్లో సాగర తీరం శోభాయమానంగా మారగా, అక్కడ జరుగుతున్న సామూహిక గణేశ్ నిమజ్జనాన్ని కనులారా చూచేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. అద్భుతమైన రీతుల్లో అలంకరించిన గణనాథుల వాహన శ్రేణి చూపరులను అమితంగా ఆకట్టుకుంది. అర్ధరాత్రి దాటినా నిమజ్జనోత్సవం ఉత్సాహభరితంగా కొనసాగింది
ఆలస్యంగా ...
గణేశ్ నిమజ్జనం కార్యక్రమం ఎన్టీఆర్ మార్గ్‌లో ఈసారి కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. గతంలో నిమజ్జన ం రోజున ఉదయం 10గంటల నుంచే భారీ సంఖ్యలో గణనాథులు తరలిరాగా బుధవారం మాత్రం మధ్యాహ్నం 2గంటల తర్వాత సందడి మొదలైంది. మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు భారీ జనసందోహం నడుమ గణనాథుల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఐదున్నర గంటలకు వర్షం కురవడంతో భక్తులంతా చెల్లాచెదురయ్యారు. గంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో నిమజ్జన కార్యక్రమంలో భక్తజనం తిరిగి హుషారుగా పాల్గొన్నారు.
ఆకట్టుకున్న చిన్ని గణేశుల ర్యాలీ
ఎన్టీఆర్ మార్గ్ వినాయక నిమజ్జన కార ్యక్రమంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. చిన్నసైజు మట్టి వినాయక విగ్రహాలను సాగర తీరానికి చిన్నిచిన్ని ట్రాలీల్లో తరలించారు. 51 విగ్రహాలు వరుసగా ట్రా లీలపై రావడం చూపరులను ఆకట్టుకుంది. హిం దూ మతానికి సంబంధించి ‘51’ని లక్కీనంబరుగా భావిస్తున్నందున అన్ని విగ్రహాలను వరుసగా ట్రాలీల్లో తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు.
డ్రైఫ్రూట్స్ గణేశ్..!
పర్యావరణాన్ని కాంక్షిస్తూ రకరకాల ఇకో ఫ్రెండ్లీ గణేశులను చూస్తూనే ఉంటాం. అయితే బుధవారం ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన వారికి డ్రైఫ్రూట్స్ గణేశుడు సాక్షాత్కరించాడు. రాంబాగ్‌కు చెందిన శ్రీహరి అలియాస్ చిరు జీడిపప్పు, కిస్‌మిస్, బాదంపప్పు, ఖర్జూర, కలకండలతో గణనాథుని తయారు చేశాడు. పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలు, రంగులు వాడకుండా ఏటా ఇలాగే డ్రైఫ్రూట్స్ గణేశుడిని రూపొందించి నిమజ్జనానికి తెస్తానని శ్రీహరి చెప్పాడు. ఇంతకీ డ్రైఫ్రూట్స్ గణేశుడి బరువెంతో తెలుసా... అక్షరాల ముఫ్ఫై కిలోలట.
టిప్పర్ గణేశ్.. బైక్ గణేశ్..!
డ్రైఫ్రూట్స్ గణేశుని సంగతి అలా ఉంటే.. గోల్నాక చెందిన దినేశ్ గణేశ్ విగ్రహాన్ని చిన్నబొమ్మ సైజు టిప్పర్(లారీ)పై ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించాడు. అలాగే గోషామహల్‌కు చెందిన సాంబశివరావు గత నాలుగేళ్లుగా తన మోటార్ బైక్‌పై గణేశుని నిమజ్జనానికి తీసుకు వస్తున్నాడట. చిత్ర విచిత్రమైన గణేశులను వీక్షించి, తమ కెమెరాల్లో బంధించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఫ్రాన్స్‌కు చెందిన కొందరు విదేశీయులు కూడా గణేశ్ ప్రతిమలను ఎంతో ఆసక్తిగా తిలకించి, తమ వెంట తెచ్చుకున్న కెమెరాలతో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు.
అగర్వాల్ సమాజం ఆతిథ్యం..
అగర్వాల్ సహాయత ట్రస్ట్ తరఫున అగర్వాల్ సమాజ్ మోతీనగర్ శాఖ గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన అతిథ్యాన్ని ఇచ్చారు. సాగర తీరంలో ఎర్పాటు చేసిన స్టాల్ నుంచి వేలాది మందికి పూరీలు, సమోసాలు, పండ్లు, ఉప్మా.. తదితర అహారపదార్థాలను ఉచితంగా అందించారు. భక్తులకు సేవ చేయాలనే తలంపుతోనే ఉదయం 10గంటల నుంచి రాత్రి 12గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని సమాజ్ అధ్యక్షుడు సతీష్ అగర్వాల్ తెలిపారు.
మోడీ, సర్దార్‌ల పలకరింపులు..!
అదేంటి నరేంద్ర మోడీ మళ్లీ నగరానికి వచ్చారని అనుకుంటున్నారా. అదేం లేదు గానీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నరేంద్ర మోడీల భారీ కటౌట్‌లను అటూ, ఇటూ ఊపుతూ పాతబస్తీకి చెందిన గుజరాతీ యువకులు సందడి చేశారు. దూరం నుంచి వీక్షించిన వారికి నరేంద్ర మోడీ తమను పలకరిస్తున్న ఫీలింగ్ కలిగేలా కటౌట్లు రూపొందించడం విశేషం.
భక్తజన పారవశ్యం
Published Thu, Sep 19 2013 3:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
Advertisement
Advertisement