జై శ్రీమన్నారాయణ..
ఇది వ్యక్తి పేరు కాదు.. జీవన మార్గ మంత్రం: జీయర్ స్వామి
- కుల మతాలున్నా పరస్పర సోదరభావం రావాలి
- రామానుజులు చెప్పింది ఇదే
- దాన్నే అంబేడ్కర్ గుర్తించారు.. మనకూ అదే స్ఫూర్తి కావాలి
- ఎల్బీ స్టేడియంలో ఘనంగా షష్టిపూర్తి మహోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ‘‘కులమతాలు అంతరించటం సాధ్యం కాదు. అసాధ్యమైన వాటి కోసం ప్రయత్నం వృథా. కానీ.. స్వీయ ఆరాధనతోపాటు సర్వ ఆదరణతత్వం రావాలి. ఒకరికొకరి మధ్య ప్రేమానురాగాలు, సోదర భావన పెంపొందాలి. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం బదులు.. సర్వప్రాణి సేవే మాధవసేవ అని రావాలి. దీనికి ఏకైక నినాదమే ‘జై శ్రీమన్నారాయణ’.. అది ఓ వ్యక్తి పేరు కాదు. మనిషి ఎలా ఉండాలో చాటిచెప్పే గొప్ప తత్వం. ఆ వాక్యంలో ఒక్కో పదం ఒక్కో అర్థాన్నిస్తూ మనిషిని పరిపూర్ణుడిగా చేస్తుంది. వెయ్యేళ్ల క్రితం రామానుజులు ఆచరించి చూపిన మార్గమది.
అశాంతి లేని సమాజం కోసం మనం ఆ బాటపట్టాలి’’ అని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి అభిలషించారు. ఆదివారం సాయంత్రం తన షష్టిపూర్తి సందర్భంగా ‘షష్టిస్ఫూర్తి జనోత్సవ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా గంటసేపు మనిషి నడవడిక, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రవచించారు. రామానుజుల మార్గదర్శనాన్ని ప్రస్తావించారు. కుల మతాల అసమానతలు సమాజానికి చేటు చేస్తాయని, అయితే వాటిని రూపుమాపటం సాధ్యం కాదని పరస్పర ప్రేమానురాగాలతో మనిషి మనిషిగా ఉండే మార్గాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. సమానత్వం కోసం పాటుపడ్డ మహనీయుడిగా అంబేడ్కర్ త రచూ రామానుజుల వారి బోధనలను ఉటంకించేవారన్నారు.
అంబేడ్కర్ బాటలో మనమూ నడవాలని పిలుపునిచ్చారు. శంషాబాద్‌లో రామానుజుల వెయ్యేళ్ల జయంతి వేడుకలను పురస్కరించుకుని ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’ నిర్మాణం, ఆయన భారీ విగ్రహ ప్రతిష్ట ఆలోచన ఇందులో భాగమేనని చెప్పారు. ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరుతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదంతోపాటు ఇతర సామాజిక రుగ్మతల నుంచి మనం బయటపడాలంటే ఆ మహనీయుడి బోధనలను అనుసరించాలని, ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే తాము ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. ‘కాలుకు ముల్లు గుచ్చుకుంటే కంటనీరొస్తుంది. అలా శరీరంలో అంగాలు వేరైనా అన్నీ కలిసి పనిచేస్తేనే ఆరోగ్యకర శరీరమవుతుంది. సమాజంలో మన తీరు కూడా అలాగే ఉండాలి. ఎవరి ఆచారాలు వారికున్నా అంతా కలిసి అన్యోన్యంగా సాగినప్పుడే ఆరోగ్యకర సమాజం ఉద్భవిస్తుంది. 36 సంవత్సరాల క్రితం సన్యాసాశ్రమం స్వీకరించినప్పటి నుంచి నేను రామానజుల బాటలో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాను. నా కార్యక్రమాలకు ప్రజలు సహకరించి విజయవంతం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. మంచి స్వార్థం అవసరమని, చెడు స్వార్థం నశించాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌పై ప్రశంసల వర్షం
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై జీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇప్పటి వరకు జరగని విధంగా దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ నిధులు కేటాయించిన ఘనత ఆయనదేనన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరో ఏదో అనుకుంటారని, ఓట్లు దూరమవుతాయని వెరవకుండా ముందుకొచ్చి యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించటం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. 1995లోనే సిద్దిపేటలోని ఇంటింటికి మంచినీటి ప్రాజెక్టు వివరాలను అప్పట్లోనే తనకు పరిచయం చేశారని, ఆయన కార్యదీక్షకు ఆయన పనితీరే నిదర్శనమన్నారు. ‘సమతామూర్తి స్ఫూర్తి’ కేంద్రం ఏర్పాటులో కూడా ఆయన సహకారం ఉందని అభినందించారు. కార్యక్రమంలో ఆయన అతిథులందరినీ పవిత్ర మాలలు, శాలువాలతో సత్కరించారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం పట్ల తాను కొంత సిగ్గుపడ్డానని, అయితే రామానజుల బాటలో ముందుకు సాగేందుకు భక్తజనం పక్షాన తనకు ఇది స్ఫూర్తి పొందే సందర్భంగా భావిస్తున్నట్టు వెల్లడించారు.
తరలి వచ్చిన భక్తజనం
షష్టిపూర్తి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ‘ఆరుపదుల నిండైన పండగ’ అక్షర నీరాజనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు జీయర్ స్వామికి పాదాభివందనం చేశారు. మై హోం అధినేత రామేశ్వరరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి దగ్గరుండి కార్యక్రమాన్ని ఆసాంతం పర్యవేక్షించారు.