హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటుకే మొగ్గిన నెహ్రూ
‘ది నిజాం బిట్వీన్ మొఘల్స్ అండ్ బ్రిటిష్’ పుస్తకావిష్కరణలో జైరాంరమేశ్
సాక్షి, హైదరాబాద్ : నాటి హైదరాబాద్ సంస్థానాన్నే హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తొలుత మొగ్గు చూపారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ చెప్పారు. ఆ తర్వాత మూడేళ్లకు ఆంధ్ర, తెలంగాణలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారన్నారు. నిజాం పాలన చివరి రోజుల్లో తప్పిదాలు జరిగాయని, అయితే హిందూ-ముస్లిం సమైక్యత, పరమత సహనం, విశ్వజన సంస్కృతి విషయంలో లౌకికత్వానికి హైదరాబాద్ సంస్థానం ప్రతిరూపంగా ఉండేదని జైరాం అన్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ వసంత్‌కుమార్ బవా రచించిన ‘ది నిజాం బిట్వీన్ మొఘల్స్ అండ్ బ్రిటిష్’ పుస్తకాన్ని శనివారం ఇక్కడ జైరాం ఆవిష్కరించి మాట్లాడారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును నెహ్రూ, అంబేడ్కర్, రాజాజీ తదితరులు వ్యతిరేకించారని, హైదరాబాద్ ప్రాంత వైవిధ్యాన్ని, సంస్కృతిని పరిరక్షించాలని వారు భావించేవారని ఆయన తెలిపారు. అయితే 1956లో నాటి కేంద్ర హోం మంత్రి.. పార్లమెంట్‌లో రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని ప్రవేశపెట్టారని, అందులో హైదరాబాద్, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉండటం కొందరికే తెలుసని అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రాంత నేతలు ఒత్తిడి తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు.
నిజాంల వల్లే తెలంగాణలో భద్రాచలం
నిజాంల వల్లే భద్రాచలం పట్టణం తెలంగాణకు వచ్చిందని జైరాం రమేశ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురికానున్న భద్రాచలం ప్రాంతాన్ని రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఏ రాష్ట్రానికి కేటాయించాలన్న అంశంపై తీవ్ర చర్చ జరిగినప్పుడు నిజాం సంస్థాన భౌగోళిక స్వరూపాన్ని అనుసరించే సమస్యను పరిష్కరించామన్నారు. అప్పట్లో భద్రాచలం పట్టణం నిజాంల ఆధీనంలో ఉండేదని, రామాలయ కస్టోడియన్‌గా నిజాం పాలకులు ఉండేవారని తెలిపారు. అయితే, భద్రాచలం డివిజన్ మాత్రం ఆంధ్ర ప్రాంత పరిధిలో ఉండేదన్నారు. దీనిని అనుసరించే భద్రాచలం పట్టణాన్ని తెలంగాణకు, రెవెన్యూ డివిజన్‌ను ఏపీకి కేటాయించామన్నారు. కాగా, ఆంగ్లేయుల పాలనతోనే భారతదేశానికి పరమత సహనం అలవడిందని, అస్పృశ్యత దూరమైందన్న వాదనలో వాస్తవం లేదని పుస్తక రచయిత బవా తెలిపారు. హిందూ-ముస్లింల ఐక్యతకు హైదరాబాద్ లాంటి సంస్థానాలే నిదర్శనమన్నారు.