
'సుప్రీం తీర్పును ప్రజలు, పార్లమెంటు తిరస్కరించాలి'
లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజలు, పార్లమెంట్ నిర్ద్వందంగా తిరస్కరించాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్‌జేఏసీ ఏర్పాటుకు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన 99వ రాజ్యాంగ సవరణను కొట్టివేస్తూ.. జడ్జీలను జడ్జీలే నియమించుకునే పాత కొలీజియం వ్యవస్థనే కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు.
దేశ చరిత్రలోనే కీలక ఘట్టమైన ఈ తీర్పుపై పార్లమెంటు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, లోతైన చర్చ జరపాలన్నారు. న్యాయమూర్తులు స్వయంభువులు, దైవదూతలు, చక్రవర్తులు కాదని పేర్కొన్నారు. జడ్జీలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి పనిచేయాల్సిందేనని తెలిపారు.
రాష్ట్రపతి సహా అందరి మద్దతు కూడగడతా..
శనివారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి సహా అందరినీ కలుస్తానని, సుప్రీంకోర్టు తాజా తీర్పుపై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తానని జయప్రకాశ్ నారాయణ చెప్పారు. పార్లమెంటు అత్యవసరంగా సమావేశమై, కనీసం వారం రోజులపాటైనా దీనిపై చర్చించాలన్నారు. దేశంలో రాజకీయాలు దిగజారడమే ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేందుకు కారణమన్న విషయాన్ని పార్లమెంటు గుర్తించాలని సూచించారు.