సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గడచిన మూడేళ్లలో 1.5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఓ వైపు జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థలు, మరోవైపు రాష్ట్రాలు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను జేఈఈ మెయిన్ ద్వారానే భర్తీ చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నా.. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య పడిపోతోంది.
2015–16 విద్యా సంవత్సరంలో 12.93 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, 2018–19లో 11.35 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఇందుకు ఉదాహరణ. ఏదో పరీక్ష రాద్దామనే ఉద్దేశంతో కాకుండా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులే దరఖాస్తు చేసుకుంటున్నారని, దరఖాస్తులు తగ్గడానికి అదే కారణమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇక ప్రవేశాల విషయానికి వస్తే.. నాలుగేళ్ల కిందటి పరిస్థితితో పోల్చితే కొంత మెరుగైనా ఇంకా సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి.
ఇంకా మిగులే..
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. గతంలో కంటే సీట్ల మిగులు అధికంగా ఉంటోంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించడం, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు ఇంటర్ మార్కులు 75% (ఎస్సీ, ఎస్టీలకు 65%) ఉంటే చాలన్న సడలింపు ఇచ్చినా సీట్ల మిగులు తగ్గడం లేదు.
సీట్ల మిగులు ఉండకుండా చూసేందుకు మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం వెయిటేజీ తొలగింపు, సడలింపులు వంటి చర్యలు చేపట్టడంతోపాటు ఏడు విడతలుగా ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. 2014–15 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో కేవలం 3 సీట్లు మిగిలిపోగా, 2017–18లో 121 సీట్లు మిగిలిపోయాయి.
అడ్వాన్స్‌డ్‌కు అర్హుల సంఖ్య పెంచినా..
జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నా పరిస్థితి అలానే ఉంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 1.5 లక్షల మంది విద్యార్థులను గతంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా తీసుకునేవారు. క్రమంగా దాన్ని టాప్ 2 లక్షలకు, టాప్ 2.2 లక్షలకు, ప్రస్తుతం టాప్ 2.24 లక్షలకు పెంచింది. అయినా సీట్ల మిగులు పెరుగుతోంది. అయితే కాన్పూర్, హైదరాబాద్ ఐఐటీల్లో మాత్రం నాలుగేళ్లుగా ఒక్కసీటు కూడా మిగలకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment