ర్యాంకులు గల్లంతు | jee main ranks skipped from cbse listout | Sakshi
Sakshi News home page

ర్యాంకులు గల్లంతు

Published Thu, Jul 2 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

ర్యాంకులు గల్లంతు

ర్యాంకులు గల్లంతు

⇒ ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో అడ్మిషన్లకు అవకాశం పోయినట్లే
⇒ మార్కులు ఇవ్వకపోవడంతోనే ర్యాంకులు కేటాయించలేదన్న సీబీఎస్‌ఈ
⇒ మార్కులు పంపించామంటున్న ఇంటర్ బోర్డు వర్గాలు విద్యార్థులకు తీవ్ర అన్యాయం
⇒ ఇంటర్‌బోర్డు, సచివాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
⇒  స్పందించిన డిప్యూటీ సీఎం కడియం
⇒ పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
⇒ నేడు ఢిల్లీకి వెళ్లనున్న అధికారులు


 సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి విద్యా సంస్థలైన ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు సంబంధించి వేలాది మంది రాష్ట్ర విద్యార్థుల ర్యాంకులు గల్లంతయ్యాయి. బుధవారం మధ్యాహ్నం అందుబాటులోకి వచ్చిన ఈ ఫలితాల్లో చాలా మంది విద్యార్థులకు ర్యాంకులను కేటాయించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో పడిపోయారు. జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో వెయిటేజీ కోసం ఇంటర్ మార్కులను పంపడంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు చేసిన పొరపాటే దీనికి కారణమంటూ బుధవారం రాత్రి ఇంటర్‌బోర్డు, సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు.

అయితే దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జేఈఈ పరీక్షలను నిర్వహించిన సీబీఎస్‌ఈతో మాట్లాడుతామని, అధికారులను ఢిల్లీకి పంపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
 జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను ఖరారు చేస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులు విద్యార్థుల మార్కుల వివరాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు (సీబీఎస్‌ఈ)కు పంపించాలి. అనంతరం ర్యాంకులను సీబీఎస్‌ఈ ప్రకటిస్తుంది. కానీ ఈసారి వేలాది మంది రాష్ట్ర విద్యార్థులకు జేఈఈ మెయిన్ ర్యాంకులను కేటాయించలేదు. తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కులను పంపడంలో చేసిన పొరపాటు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు తాము విద్యార్థులందరి మార్కులను సీబీఎస్‌ఈకి పంపించామని, అక్కడే ఏదో సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏదైనా ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం సాయంత్రమే ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించారు. అయితే తాము సీబీఎస్‌ఈతో మాట్లాడుతున్నామని అధికారులు చెబుతున్నారే తప్ప స్పష్టత ఇవ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందంటూ ఇంటర్ బోర్డు,  సచివాలయం వద్ద బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. మరోవైపు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కులను కూడా ఇంటర్ బోర్డు సీబీఎస్‌ఈకి పంపకపోవడంతో విద్యార్థులకు ర్యాంకులను కేటాయించలేదని కొంతమంది తల్లిదండ్రులు వాపోతున్నారు.

 వేలాది మందికి..
 రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్ ఉత్తీర్ణులైన వారిలో 69,234 మంది జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకోగా 66,596 మంది పరీక్ష రాశారు. వారిలో వేలాది మంది అర్హత సాధించారు. ఇందులో 1,178 మందికిపైగా విద్యార్థులకు ర్యాంకులు రాలేదని తల్లిదండ్రులు పేర్కొంటుండగా.. మొత్తంగా ఎంతమందికి ర్యాంకులు రాలేదన్న దానిపై స్పష్టత లేదు. రాష్ట్ర విద్యార్థిని కుసుమకు ఇంటర్‌లో 940 మార్కులు, జేఈఈ మెయిన్‌లో 186 మార్కులు వచ్చాయి. ఆమెకు కచ్చితంగా జేఈఈ మెయిన్ ర్యాంకు రావాల్సి ఉంది. కానీ ఇంటర్ మార్కుల వెయిటేజీని కలపకపోవడంతో అసలు ర్యాంకునే కేటాయించలేదు.

ఇలాంటి విద్యార్థులు వేల మంది ఉన్నట్లు అంచనా. ర్యాంకులు రాని వారిలో ఓ జిల్లా కలెక్టర్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలిసింది. తమ పిల్లలకు ర్యాంకులను కేటాయించకపోవడంపై తల్లిదండ్రులు సీబీఎస్‌ఈ హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించగా.. ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కులను అప్‌లోడ్ చేయపోతే మేమేం చేస్తామని, ర్యాంకులు ఎలా ఇస్తామని సమాధానం వచ్చింది. అసలు ఇంటర్ మార్కులు పంపాలని అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డులకు రెండుసార్లు తెలియజేశామని, మార్కులను అప్‌లోడ్ చేసేందుకు సమయం కూడా ఇచ్చామని హెల్ప్‌డెస్క్ నుంచి సమాధానం వచ్చింది.

 ఏపీ విద్యార్థులకు నిరాశ..
 జేఈఈ మెయిన్స్ ర్యాంకులలో ఏపీ విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ఏపీ విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ర్యాంకులు దక్కలేదని ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. జేఈఈ మెయిన్స్ ర్యాంకులు వెల్లడయ్యే రోజు పలు కార్పొరేట్ సంస్థలు చేసే హడావుడి బుధవారం కానరాలేదు.

 టాప్‌లో తెలుగు విద్యార్థులు
 జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు పలు ఉత్తమ ర్యాంకులు సాధించారు. బీఆర్క్ విభాగం ఓపెన్ కేటగిరీలో  షర్మిలారెడ్డి మొదటి ర్యాంకు సాధించింది. ఇక ఎస్‌ఎన్‌వీఎస్‌ఆర్ కష్ణపథ్వి 3వ ర్యాంకు, డి.సాయి భాస్కర్ 4వ ర్యాంకు, బి.వి.ఎస్.నాయుడు 5వ ర్యాంకు, గోక హర్షిత్ 8వ ర్యాంకు (బీఆర్క్, బీటెక్), కుడుముల ఆహ్వాన్‌రెడ్డి 10వ ర్యాంకు సాధించారు.
 విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు

 నేడు ఢిల్లీకి ఉన్నతాధికారులు
 రాష్ట్ర విద్యార్థులకు జేఈఈ మెయిన్ ర్యాంకులను కేటాయించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెంటనే అప్రమత్తం అయ్యారు. గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లి సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌లను ఆదేశించారు. తాను కూడా కేంద్ర మంత్రి స్మతి ఇరానీతో మాట్లాడుతానని.. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు. అవ సరమైతే తాను కూడా ఢిల్లీ వెళ్లి విద్యార్థులకు ర్యాంకులు కేటాయించేలా చూస్తానని చెప్పారు. పొరపాటు ఇంటర్ బోర్డు వద్ద జరిగిందా, సీబీఎస్‌ఈలో జరిగిందా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. కాగా తెలంగాణ విద్యార్థులకు జేఈఈ మెయిన్ ర్యాంకులు కేటాయించని విషయాన్ని సీబీఎస్‌ఈ చైర్మన్ సబీర్ బేడీ దష్టికి తీసుకెళ్లినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు. అలాగే సీబీఎస్‌ఈ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌తోనూ మాట్లాడామని, ర్యాంకులు ఇచ్చేందుకు వారు హామీ ఇచ్చారని తెలిపారు.

 ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
 ‘‘ఇంటర్ బోర్డు చేసిన తప్పిదం కారణంగా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల మార్కులను అప్‌లోడ్ చేసిన మళ్లీ ర్యాంకులు ప్రకటించాలి..’’    -గోపాలకష్ణ

 కౌన్సెలింగ్ ఆపేయాలి
 ‘‘ప్రస్తుతం జరుగుతున్న వెబ్ కౌన్సెలింగ్ ఆపేయాలి. రీ వెరిఫికేషన్, రీ వ్యాల్యూయేషన్ పెట్టుకున్న విద్యార్థుల మార్కులను అప్‌లోడ్ చేయాలి. జేఈఈ మెయిన్స్ ర్యాంకులు ప్రకటించిన తర్వాతే కౌన్సెలింగ్ మొదలు పెట్టాలి. ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..’’    -వెంకటయ్య
 చర్యలు తీసుకోవాలి
 ‘‘విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకున్న ఇంటర్ బోర్డు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ర్యాంకులు రాలేదని మా పిల్లలు ఏమైనా చేసుకుంటే బాధ్యత ఇంటర్ బోర్డు వహిస్తుందా?’’
 -ప్రసాద్
 
 మొదలైన ప్రవేశాల ప్రక్రియ
 ఐఐటీ, ఐఎస్‌ఎం, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి తుది ఏక్టివిటీ షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం...
 
 ఏక్టివిటీ    తేదీ
 చాయిస్‌ల ఆన్‌లైన్ ఫిల్లింగ్:    1-5 జూలై
 మాక్ సీట్ అలకేషన్:    4 జూలై
 అలకేషన్/వేలిడేషన్:    6 జులై
 మొదటి విడత సీట్ల కేటాయింపు:    7 జులై
 మొదటి విడత సీట్ల ఏక్సెప్టెన్సీ:    8-12 జూలై
 రెండో విడత సీట్ల కేటాయింపు:    13 జూలై
 రెండో విడత సీట్ల ఏక్సెప్టెన్సీ:    14-17 జూలై
 మూడో విడత సీట్ల కేటాయింపు:    18 జూలై
 మూడో విడత సీట్ల ఏక్సెప్టెన్సీ:    19-21 జూలై
 ఏక్టివిటీ    తేదీ
 నాలుగో విడత సీట్ల కేటాయింపు
 (ఐఐటీ ప్రిపరేటరీ కోర్సులు):    22 జూలై
 అకడమిక్ సెషన్ ప్రారంభం:    22 జూలై
 నాలుగో విడత సీట్ల ఏక్సెప్టెన్సీ:    23-26 జూలై
 అభ్యర్థుల రిపోర్టింగ్
 (ఎన్‌ఐటీలు):    23-26 జూలై
 ఐఐటీ ప్రిపరేషన్
 కోర్సుల తరగ తులు:    27 జూలై
 ఎన్‌ఐటీ తరగతులు ప్రారంభం:    28 జూలై
 (ఐఐటీల ఫిజికల్ రిపోర్టింగ్ షెడ్యూల్ తదుపరి ప్రకటిస్తారు)
 
 
 జేఈఈ మెయిన్‌లో  శ్రీచైతన్య నారాయణ టాప్
 హైదరాబాద్: జేఈఈ మెయిన్-2015 ఫలితాల్లోనూ శ్రీచైతన్య నారాయణ విద్యార్థులు ప్రభంజనం సష్టించారని ఆ విద్యా సంస్థ అకడమిక్ డెరైక్టర్లు సుష్మ, పి.సింధునారాయణ పేర్కొన్నారు. ఆలిండియా స్థాయిలో బీ.టెక్/బీ.ఆర్క్ ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకుతో పాటు 10లోపు 7 ర్యాంకులు, 20లోపు 17 ర్యాంకులు, 50లోపు 43 ర్యాంకులు, 100లోపు 94 ర్యాంకులను తమ విద్యార్థులే సాధించారని చెప్పారు. పరీక్షా విధానం మారినా ఎన్‌ఐటీ, త్రిపుల్‌ఐటీల్లో అత్యధిక శాతం సీట్ల వాటా తమదేనని నిరూపించారని, పటిష్ట ప్రణాళిక, ప్రత్యేక ప్రోగ్రామ్‌లు, అధ్యాపకుల నిరంతర కషి ఈ విజయాలకు కారణమన్నారు. ఈ విజయం సాధించిన విద్యార్థులు, అధ్యాపక బందాన్ని వారు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement