ఉద్యోగాలు పెంచకుండా జిల్లాలెలా?: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతమున్న 10 జిల్లాలను 27 కు పెంచిన ప్రభుత్వం, అందుకు అనుగుణంగా ఉద్యోగులను నియమించాలని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. జిల్లాలను పెంచినా ఇప్పుడున్న ఉద్యోగులతోనే పరిపాలన నడిపించాలనే ప్రభుత్వ నిర్ణయం విస్మయం కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
జిల్లాల పెంపుతో పాలనా సౌలభ్యం, నూతన ఉద్యోగాలకు అవకాశం, ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయని ఆశిస్తున్న వారికి నిరాశ కలిగించే విధంగా సీఎం కేసీఆర్ తీరుందని విమర్శించారు. ఉద్యోగుల సంఖ్యను పెంచకుండా, ప్రమోషన్లు ఇవ్వకుండా జిల్లాలను పెంచాలనే నిర్ణయం తిరోగమన చర్య అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలను నిరుద్యోగులకు, ఉద్యోగులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు.