ఓ రాధిక అంతరంగం
జో...గి...ని... ఈ పదం అంటేనే ఒక రకంగా చూస్తారు. అసలు వాళ్లు బాహ్యప్రపంచంలోకి రావడమే బాగా అరుదు. కేవలం ఉత్సవాల సమయంలో మాత్రమే వాళ్లు బయట కనపడుతుంటారు. కానీ, ఒక జోగిని బయటకు వచ్చి కెమెరా ముందు నిలబడి తన అంతరంగాన్ని వెల్లడించడం ఒకరకంగా పెద్ద సాహసమే. జోగిని రాధిక ఆ సాహసం చేసింది. 'సాక్షి' స్టూడియోకు వచ్చి.. తామేంటో.. తమ బతుకేంటో.. ఏం అవుదామనుకుంటున్నామో చెప్పింది. ఆమె చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..
''ఇది ట్రెడిషన్ కాదు.. కుటుంబం ఆచారంలా రాదు. జోగినిలు పెళ్లి చేసుకోరు.
నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. నాకు పదేళ్ల సమయంలో అమ్మవారు వచ్చారు. అప్పుడు ఆలయాలకు తీసుకెళ్లినా పెద్దగా మార్పులేదు. దేవుడికి అనుబంధంగా పెడితే బాగుంటుందనిపించి అలా చేశారు.
బోనాల పండగలో జోగినికి చాలా ప్రత్యేకత ఉంది. బోనం జోగినితో చేయించడం వల్ల పవిత్రత ఉంటుందని భావిస్తారు. అన్ని ఆలయాలకూ పిలుస్తారు. గోల్కొండలో మొదటి బోనాలు మొదలవుతాయి. తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, తర్వాత మహంకాళి, ఆ తర్వాత లాల్ దర్వాజ ఆలయాల్లో జరుగుతాయి. అమ్మవారికి తొలిబోనం మేమే సమర్పిస్తాము. కొన్ని ఇళ్లల్లో కూడా జోగినిలతో బోనం ఇప్పిస్తే మంచిదని భావించేవాళ్లు ఉంటారు. జిల్లాల్లో కొన్నిచోట్ల జోగినులు చాలా సమస్యలు అనుభవిస్తున్నారు. ఏడాదికోసారి ఉత్సవాల సమయంలోనే పూజకు పరిమితం అవుతారు. హైదరాబాద్లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పూజలు, దేవుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో మేం ఉంటాం. జోగినికి పూనకం వస్తుందని, దేవుడితో సంబంధం ఉంటుందని చెప్పడం వల్ల మాపై కొంత గౌరవం ఉంటుంది. గ్రామాల్లో మాత్రం వీళ్ల పరిస్థితి అంత బాగోలేదు. ఈ పరిస్థితిపై శ్యామల ఇప్పటికే ఓ సినిమా తీశారు. జోగినులు పెళ్లి చేసుకోరు. అయినా గ్రామాల్లో మాత్రం పటేళ్లు, పట్వారీలు వీళ్లని దోచుకుంటారు. అలాంటప్పుడు వాళ్లకు పుట్టే పిల్లలకు తండ్రులు ఉండరు. అలాంటప్పుడు వాళ్లు బయటకు వెళ్తే, జోగిని పిల్లలు అంటూ తిరస్కరిస్తారు. అదే నగరాల్లో అయితే.. ఎవరు ఎవరో తెలియదు. దాంతో పిల్లల పరిస్థితి కూడా కొంత మెరుగ్గానే ఉంటుంది. కొంతమంది నవ్వేవాళ్లు ఉంటారు. ఆదరించేవాళ్లు ఉంటారు. సిటీలో అలాంటి సమస్యలు ఏమీలేవు. ఇలాంటి సమస్యల మీద శ్యామల లాంటివాళ్లు పోరాటం చేశారు. ఏదైనా ఒకచోట ఉన్న సమస్యలపై మేం పరిశోధన చేసినంత మాత్రాన సరిపోదు. తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కూడా చర్యలు తీసుకోవాలి.
ఈ వృత్తిలో ఉన్నవాళ్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. పూజల విషయంలో కూడా కాంట్రవర్సీ ఎక్కువ. ఏ పని చేసినా ఎవరో ఒకరు రోల్ మోడల్ గా ఉంటారు కదా. వాళ్లు అలా చేస్తున్నారు, మీరలా చేస్తున్నారని అంటారు. మా ఉపాధి విషయానికి వస్తే.. ఘటాలు చేస్తున్నప్పుడు... తృప్తి మేరకు ఇస్తారు, వడిబియ్యం పోస్తారు. అమ్మవారికి పూజ చేసేవాళ్లు తప్పకుండా మమ్మల్ని పిలుస్తారు.
ఈ వ్యవస్థను బాగు చేయాలనే నాకూ ఉంది. అందుకోసం ప్రతి ఊరుకి వెళ్లాలి, కౌన్సెలింగ్ చేయాలి. ఈ వ్యవస్థను నేను ఎంకరేజ్ చేయను. నేను జోగినిగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో చెబుతాను. సీనియర్ జోగినిలు మీరు ఇలాగే ఉండాలి, మేం చెప్పినట్లు చేయాలి అంటారు. నేను ఘటం ఎత్తుకున్నప్పుడు టీవీలో చూపిస్తే అది నా తప్పు కాదు కదా. ఇలాంటి వాటిని వాళ్లు తప్పుపడతారు. ఇలా ఎందుకు రెడీ అవుతారని అడుగుతారు. అమ్మ ఆవహించినప్పుడు.. పూనకం వచ్చినప్పుడు ఏమవుతుందో నాకూ తెలియదు. నాలాంటివాళ్లకు సాయం చేయాలని ఉంది.''