కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కాలం చెల్లినవని, దేశంలో ఆదరణ కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కాలం చెల్లినవని, దేశంలో ఆదరణ కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించడం ఆ పార్టీల దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. బుధవారం బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆకుల విజయ బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలు నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. చౌకబారు వ్యాఖ్యలతో సీపీఐ నేత నారాయణ వార్తల్లో ఉండాలనుకుంటున్నారని, ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. స్కిల్ ఇండియా ద్వారా రాష్ట్రంలోనూ లక్షలాది మందికి ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందన్నారు.