రూసా కింద నిధులు అందించండి
కేంద్రాన్ని కోరిన కడియం శ్రీహరి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఉన్నత విద్యాభివృద్ధికి రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులు అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యశాఖ మంత్రి కడియం శ్రీహరి కేంద్రా న్ని కోరారు. సోమవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ అధ్యక్షతన జరిగిన రూసా నేషనల్ మిషన్ అథారిటీ సమావేశంలో శ్రీహరి పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డులో మంజూరు చేసిన విధంగా రాష్ట్రాలకు నిధులు విడుదల చేయట్లేదని కడియం ఆందో ళన వ్యక్తం చేశారు. .
కనీసం 50 శాతం ని«ధులు కూడా విడుదల చేయక పోవడంతో పథకాల పనులు పూర్తి చేయలేకపోతున్నామన్నారు. రూసా మార్గదర్శాకాల్లో మార్పు లు తేవాల్సిన అవసరం ఉందని, నిధుల వినియోగంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని కడియం సూచించారు. విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో మోడల్ డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలను మంజూరు చేస్తే ఆ ప్రాంతాల అబివృద్ధికి ఉపయోగపడుతా యన్నారు.
ఉన్నత విద్యలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయ శిక్షణపై దృష్టి సారించాలని, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యం అభివృద్ధికి రూసా నిధులు అధికంగా వ్యయం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్ రూ.200 కోట్లు అందించారని, కేంద్రం కూడా నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం, ఐఐఎం మంజూరు చేయాలని కోరారు. అందుకు ప్రకాశ్ జవదేకర్ సానుకూలంగా స్పందించారని, తెలంగాణకు నిధులు, వసతులు లభిస్తాయని ఆశిస్తున్నామని శ్రీహరి చెప్పారు. కల్వకుర్తిలో న్యూ మోడల్ డిగ్రీ కాలేజి ఆధునీకరణ ప్రాజెక్ట్‌ను ప్రకాశ్ జవదేకర్ ఆవిష్కరించారు.