Rusa
-
ఉన్నత విద్యలో అధ్యాపకులేరీ?
సాక్షి, హైదరాబాద్; రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం అధ్యాపకుల్లేక ఇబ్బందులు పడుతోంది. వేల పోస్టుల భర్తీ లేక కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో సంబంధిత శాఖలు ఉన్న కొద్ది మంది అధ్యాపకులు, కాంట్రాక్టు సిబ్బందితో బోధనను కొనసాగిస్తున్నాయి. దీంతో ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి పరీక్షల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు వెనుకబడుతున్నారు. మరోవైపు అధ్యాపకులు లేని కారణంగానే డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి రావడం లేదు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ (న్యాక్) గుర్తింపుగల విద్యా సంస్థలకే రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధులిస్తామని కేంద్రం గత మూడేళ్లుగా మొత్తుకుంటున్నా అధ్యాపకుల నియామకంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. లేఖలు రాయడానికే పరిమితం.. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా కాలేజీల్లో 1,200 పోస్టులు దాదాపు ఏడేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. వాస్తవానికి 1,951 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అందులో 751 పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నందున కనీసం 1,200 పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ ప్రభుత్వాన్ని ఏళ్ల తరబడి కోరుతూనే ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడం, కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ సమస్యల వంటి కారణాలతో ఆ పోస్టుల భర్తీ ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మంజూరైన జూనియర్ లెక్చరర్ పోస్టులు 6,719 ఉండగా 1,040 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 5,679 పోస్టులు ఖాళీగా ఉండగా, అందులో 3,728 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. మిగిలిన 1,951 పోస్టుల్లో 1,200 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మిగతా 751 పోస్టుల్లో తాత్కాలిక పద్ధతిన గెస్ట్ లెక్చరర్లు (రిటైరైన వారు) బోధిస్తున్నారు. ఆ 1,200 పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని ఇటీవల ఇంటర్ విద్యా కమిషనర్‌గా వచ్చిన సయ్యద్ ఉమర్ జలీల్ లేఖ రాసినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. డిగ్రీ కాలేజీల్లోనూ అంతే.. రాష్ట్రంలోని 131 డిగ్రీ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీ వ్యవహారం ఏడేళ్లుగా అచరణకు నోచుకోవడం లేదు. డిగ్రీ కాలేజీల్లో మొత్తంగా మంజూరైన పోస్టులు 4,099 ఉండగా అందులో 1,280 పోస్టుల్లోనే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 2,819 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు/గెస్ట్ ఫ్యాకల్టీ 1,883 పోస్టుల్లో పనిచేస్తుండగా 936 పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వాటి భర్తీకి అనుమతివ్వాలని గతంలోనే కోరినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. గతేడాది 31 కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జోన్ల ఏర్పాటు, ఆ తరువాత వాటికి రాష్ట్రపతి ఆమోదం లభించినా పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు చేపట్టలేదు. ఇక ఇటీవలి కాలంలో మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, వాటిని కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లలో చేరుస్తూ ఫైలు కేంద్రానికి పంపడంతో వాటి భర్తీ పెండింగ్‌లో పడిపోయింది. రాష్ట్రపతి ఆమోదం తరువాతనైనా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. వర్సిటీల్లోనూ పడని అడుగులు రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోనూ పోస్టుల భర్తీ వ్యవహారం ముందుకు కదలట్లేదు. 2016లో కొత్తగా వీసీలను నియమించినా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతిచ్చినా వీసీలు పట్టించుకోలేదు. ఆ తరువాత కోర్టు కేసులు తదితరాలతో భర్తీని పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడైతే పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదు. యూనివర్సిటీలకు పూర్తిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు లేవు. పూర్తిస్థాయి వీసీలు లేరు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టులు 2,738 ఉండగా అందులో 1,528 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అందులో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 687 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2016 నాటికి సేకరించిన లెక్కల ప్రకారమే ఈ ఖాళీలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగిందని ఉన్నత విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న 1,528 పోస్టుల్లోనూ మొదటి విడతలో కేవలం 1,061 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం 2016లోనే నిర్ణయించింది. కనీసం వాటి భర్తీ అయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. -
200 కాలేజీలకు మించకూడదు!
సాక్షి, హైదరాబాద్: ఒక్కో యూనివర్సిటీ పరిధిలో ఇకపై 200 కు మించి అనుబంధ కాలేజీలు ఉండటానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. అంతకుమించి కాలేజీలు ఉంటే రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) కింద నిధులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. నిధులు కావాలంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఉండాల్సిందేన ని పేర్కొంది. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు, కళాశాల విద్య కమిషనర్ల సమావేశంలో పేర్కొంది. రూసా రెండో దశ కార్యక్రమాలను వచ్చే నెల 3 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దీన్ని వెల్లడించింది. 600కు పైగా కాలేజీలు.. రాష్ట్రంలోని వర్సిటీల పరిధిలోని అనుబంధ కాలేజీలపై ఉన్నత విద్యా శాఖ దృష్టి సారించింది. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్, కాకతీయ, ఉస్మానియా వంటి యూనివర్సిటీల పరిధిలో 600కు పైగా అనుబంధ కాలేజీలు ఉన్నాయి. దీంతో వాటి పరిధిలోని కాలేజీలను విభజించే అంశంపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిని మార్చాలని ఇప్పటికే ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఒక జిల్లాలో యూనివర్సిటీ ఉన్నా ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు వేరే యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. దీంతో వాటిని మార్పు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. ప్రస్తుత కేంద్ర ఆదేశాల నేపథ్యంలో యూనివర్సిటీల పరిధులతో పాటు వాటి కింద ఉండాల్సిన అనుబంధ కాలేజీల లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ విద్యా సంస్థలను (యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వంటివి) పలు ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే సంస్థలుగా మార్చే ఆలోచనలు చేస్తోంది. పాత జిల్లాల పరిధిలో ఒకట్రెండు గుర్తింపునిచ్చే సంస్థలను ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తోంది. వీటన్నింటిపై త్వరలోనే జరగనున్న ఉన్నత విద్యా మండలి సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. కొత్త విద్యా సంవత్సరంలో హైదరాబాద్‌లోని కోఠి మహిళా కాలేజీని యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ పనుల కోసం రూ.50 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. -
రూసా కింద నిధులు అందించండి
కేంద్రాన్ని కోరిన కడియం శ్రీహరి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఉన్నత విద్యాభివృద్ధికి రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులు అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యశాఖ మంత్రి కడియం శ్రీహరి కేంద్రా న్ని కోరారు. సోమవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ అధ్యక్షతన జరిగిన రూసా నేషనల్ మిషన్ అథారిటీ సమావేశంలో శ్రీహరి పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డులో మంజూరు చేసిన విధంగా రాష్ట్రాలకు నిధులు విడుదల చేయట్లేదని కడియం ఆందో ళన వ్యక్తం చేశారు. . కనీసం 50 శాతం ని«ధులు కూడా విడుదల చేయక పోవడంతో పథకాల పనులు పూర్తి చేయలేకపోతున్నామన్నారు. రూసా మార్గదర్శాకాల్లో మార్పు లు తేవాల్సిన అవసరం ఉందని, నిధుల వినియోగంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని కడియం సూచించారు. విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో మోడల్ డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలను మంజూరు చేస్తే ఆ ప్రాంతాల అబివృద్ధికి ఉపయోగపడుతా యన్నారు. ఉన్నత విద్యలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయ శిక్షణపై దృష్టి సారించాలని, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యం అభివృద్ధికి రూసా నిధులు అధికంగా వ్యయం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్ రూ.200 కోట్లు అందించారని, కేంద్రం కూడా నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం, ఐఐఎం మంజూరు చేయాలని కోరారు. అందుకు ప్రకాశ్ జవదేకర్ సానుకూలంగా స్పందించారని, తెలంగాణకు నిధులు, వసతులు లభిస్తాయని ఆశిస్తున్నామని శ్రీహరి చెప్పారు. కల్వకుర్తిలో న్యూ మోడల్ డిగ్రీ కాలేజి ఆధునీకరణ ప్రాజెక్ట్‌ను ప్రకాశ్ జవదేకర్ ఆవిష్కరించారు. -
వచ్చే ఏడాది కోసం రూసా ప్రతిపాదనలు
21న అన్ని వర్సిటీల వీసీలతో భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి కావాల్సిన నిధులకు సంబంధించి ప్రణాళికలను ఖరారు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రాష్ట్రంలో రూసా అమలుకు నియమించిన ప్రాజెక్టు డెరైక్టరేట్ అధికారులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ వెంకటాచలం, కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్, వివిధ వర్సిటీల రిజిస్ట్రార్లతో చర్చించారు. ఈ విద్యా సంవత్సరం కోసం రూసా కింద కేంద్రం కేటాయించిన రూ. 130 కోట్ల ప్రగతిని సమీక్షించారు. వచ్చే ఏడాది (2016-17) యూనివర్సిటీల వారీగాచే పట్టాల్సిన విద్యాభివృద్ధి కార్యక్రమాలు, మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఈ నెల 21న ఇందుకోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో అన్ని వర్సిటీలు తమ ప్రణాళికలను అందజేయాలని సూచించారు. వాటిని క్రోడీకరించి స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తారు. సెప్టెంబర్‌లో ఆ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఇందులో ప్రత్యేకంగా మహబూబ్‌నగర్‌లో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించే అవకాశం ఉంది. ‘న్యాక్’ గుర్తింపు లేదు.. నిధులు వచ్చేనా? రూసా కింద వర్సిటీలు, డిగ్రీ కాలేజీల అభివృద్ధికి కేంద్రం నిధులను ఇవ్వాలంటే న్యాక్ గుర్తింపు తప్పనిసరి. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు వర్సిటీకి తప్ప మరే విద్యా సంస్థకు న్యాక్ గుర్తింపు లేదు. గతంలో ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ వర్సిటీలకు న్యాక్ గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం లేదు. రెగ్యులర్ వైస్ చాన్స్లర్లు లేని కారణంగా న్యాక్ గుర్తింపు ఇవ్వలేదు. వచ్చే ఏడాది మాత్రం న్యాక్ గుర్తింపు లేకుండా రూసా నిధులు వచ్చే పరిస్థితి లేదు. దీనిపై నిధులు వస్తాయో లేదో అని అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది.