ఉన్నత విద్యలో అధ్యాపకులేరీ? | There Is No Lecturers In Higher Education | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యలో అధ్యాపకులేరీ?

Published Mon, Nov 4 2019 5:49 AM | Last Updated on Mon, Nov 4 2019 5:49 AM

There Is No Lecturers In Higher Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌; రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం అధ్యాపకుల్లేక ఇబ్బందులు పడుతోంది. వేల పోస్టుల భర్తీ లేక కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో సంబంధిత శాఖలు ఉన్న కొద్ది మంది అధ్యాపకులు, కాంట్రాక్టు సిబ్బందితో బోధనను కొనసాగిస్తున్నాయి. దీంతో ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వంటి పరీక్షల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు వెనుకబడుతున్నారు. మరోవైపు అధ్యాపకులు లేని కారణంగానే డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి రావడం లేదు. నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ (న్యాక్‌) గుర్తింపుగల విద్యా సంస్థలకే రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) నిధులిస్తామని కేంద్రం గత మూడేళ్లుగా మొత్తుకుంటున్నా అధ్యాపకుల నియామకంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది.

లేఖలు రాయడానికే పరిమితం..
రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా కాలేజీల్లో 1,200 పోస్టులు దాదాపు ఏడేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. వాస్తవానికి 1,951 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అందులో 751 పోస్టుల్లో గెస్ట్‌ లెక్చరర్లు పని చేస్తున్నందున కనీసం 1,200 పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ ప్రభుత్వాన్ని ఏళ్ల తరబడి కోరుతూనే ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడం, కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్‌ సమస్యల వంటి కారణాలతో ఆ పోస్టుల భర్తీ ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.

ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మంజూరైన జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు 6,719 ఉండగా 1,040 మంది మాత్రమే రెగ్యులర్‌ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 5,679 పోస్టులు ఖాళీగా ఉండగా, అందులో 3,728 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. మిగిలిన 1,951 పోస్టుల్లో 1,200 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మిగతా 751 పోస్టుల్లో తాత్కాలిక పద్ధతిన గెస్ట్‌ లెక్చరర్లు (రిటైరైన వారు) బోధిస్తున్నారు. ఆ 1,200 పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని ఇటీవల ఇంటర్‌ విద్యా కమిషనర్‌గా వచ్చిన సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ లేఖ రాసినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు.

డిగ్రీ కాలేజీల్లోనూ అంతే..
రాష్ట్రంలోని 131 డిగ్రీ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీ వ్యవహారం ఏడేళ్లుగా అచరణకు నోచుకోవడం లేదు. డిగ్రీ కాలేజీల్లో మొత్తంగా మంజూరైన పోస్టులు 4,099 ఉండగా అందులో 1,280 పోస్టుల్లోనే రెగ్యులర్‌ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 2,819 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు/గెస్ట్‌ ఫ్యాకల్టీ 1,883 పోస్టుల్లో పనిచేస్తుండగా 936 పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వాటి భర్తీకి అనుమతివ్వాలని గతంలోనే కోరినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

గతేడాది 31 కొత్త జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ, కొత్త జోన్ల ఏర్పాటు, ఆ తరువాత వాటికి రాష్ట్రపతి ఆమోదం లభించినా పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు చేపట్టలేదు. ఇక ఇటీవలి కాలంలో మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, వాటిని కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లలో చేరుస్తూ ఫైలు కేంద్రానికి పంపడంతో వాటి భర్తీ పెండింగ్‌లో పడిపోయింది. రాష్ట్రపతి ఆమోదం తరువాతనైనా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

వర్సిటీల్లోనూ పడని అడుగులు
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోనూ పోస్టుల భర్తీ వ్యవహారం ముందుకు కదలట్లేదు. 2016లో కొత్తగా వీసీలను నియమించినా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతిచ్చినా వీసీలు పట్టించుకోలేదు. ఆ తరువాత కోర్టు కేసులు తదితరాలతో భర్తీని పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడైతే పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదు. యూనివర్సిటీలకు పూర్తిగా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లు లేవు. పూర్తిస్థాయి వీసీలు లేరు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టులు 2,738 ఉండగా అందులో 1,528 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి.

అందులో 323 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా 687 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 518 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2016 నాటికి సేకరించిన లెక్కల ప్రకారమే ఈ ఖాళీలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగిందని ఉన్నత విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న 1,528 పోస్టుల్లోనూ మొదటి విడతలో కేవలం 1,061 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం 2016లోనే నిర్ణయించింది. కనీసం వాటి భర్తీ అయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement