సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి విద్యారంగాన్ని కాపాడటమే తమ లక్ష్యమని, అలాగే బీజేపీ కాషాయీకరణ పంథా నుంచి విద్యారంగాన్ని రక్షించడమే ఎజెండా అని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) స్పష్టం చేసింది. ఇందుకు అవసరమైన అస్త్ర, శస్త్రాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. విద్యార్థి లోకాన్ని నిద్రలేపి, కలసి వచ్చే సంఘాలతో సమైక్య పోరుకు సిద్ధమని స్పష్టం చేసింది. హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు సాగిన ఎస్‌ఎఫ్‌ఐ 17వ మహాసభలు శుక్రవారంతో ముగిశాయి.
23 రాష్ట్రాలకు చెందిన 697 మంది ఆహ్వానితులు ఈ సభలకు హాజరయ్యారు. సభల ప్రారంభం రోజు విద్యార్థి గళాన్ని లోకానికి వినిపించేలా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కీలకోపన్యాసం చేశారు. పేదవాడికి విద్యారంగాన్ని దూరం చేస్తున్న పాలకుల విధానాలను ఎండగట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సాగిన తొలి రోజు సభలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ప్రసంగం అన్ని వర్గాలను కదిలించింది.
నాలుగు రోజులపాటు 35 అంశాలపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను, ఉపాధ్యక్షురాలు దిప్సిత ధర్, ప్రధాన కార్యదర్శులు మయూక్ బిస్వాస్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టి నాగరాజు తదితరులు పలు అంశాలపై ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశాల సందర్భంగా సభ జాతీయ కమిటీని ఎన్నుకుని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
(చదవండి: ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడిగా సాను )
Comments
Please login to add a commentAdd a comment