అల్వాల్: ఓ రాష్ట్రానికి సీఎం అనగానే... సీరియస్ చిత్రాన్ని ఊహించుకుంటాం. కానీ... సంగీత ప్రియుడైన మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కొంగల్ సంగ్మా రాక్‌స్టార్‌గా మారిపోయారు. హైదరాబాద్, అల్వాల్‌లోని లయోలా కళాశాలలో శుక్రవారం జరిగిన వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన... సభలో గిటార్ వాయిస్తూ పాటపాడి విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా సంగ్మా మాట్లాడుతూ... సంగీతం మనసుని తేలిక పరుస్తుందన్నారు.
ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశం ఉన్నతి అయినా, తిరోగమనం అయినా విద్యార్థుల చేతిలోనే ఉందని, అందుకే భవిష్యత్ పట్ల స్పష్టమైన అవగాహనతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. యువతను సన్మాన మార్గంలో నడిపించే భాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యా రంగానికి విశేష సేవలు అందించిన అధ్యాపకులు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 73 మంది విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామక్రిష్ణారావు, లయోలా ప్రిన్సిపాల్ ఫాదర్ జోజిరెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు వందలాదిగా పాల్గొన్నారు.
ప్రగతిభవన్‌కు మేఘాలయ సీఎం దంపతులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. సంగ్మా దంపతులను మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్ దంపతులతో భేటీ అయిన ఫొటోలను సంగ్మా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment