రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి గత ఏడాదితో పోలిస్తే, ఈసారి రూ.2,477 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ముఖ్యంగా మన ఊరు–మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.7,289 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మహిళా యూనివర్సిటీకి, అటవీ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించింది. గత ఏడాది విద్యారంగం కేటాయింపులు రూ.13,608 కోట్లు ఉంటే.. ఈసారి ఈ పద్దు రూ.16,085 కోట్లకు చేరింది.
ఉన్నత విద్యకు గత ఏడాది రూ.1,873 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.2,357.72 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు గత ఏడాది రూ.11,735 కోట్లు ఉంటే, ఈసారి ఇది 13,725.97 కోట్లకు పెరిగింది. మొత్తం మీద రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగం వాటా గత ఏడాది 6.1 శాతంగా ఉంటే, ఈసారి 6.2 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
– సాక్షి, హైదరాబాద్
కేటాయింపులు భేష్: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: విద్యారంగం కేటాయింపులపై ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘మన ఊరు–మనబడి’ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం ఆలోచనలు బడ్జెట్‌లో ప్రతిబింబించాయన్నారు. బడ్జెట్‌పై సోమవారం ఆమె స్పందిస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి కానుకగానే ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.వంద కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా రూ.7,289 కోట్లతో చేపట్టనున్న ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమానికి దశల వారీగా శ్రీకారం చుడుతూ, మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో కార్యాచరణ ప్రారంభించటం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. జిల్లాకో వైద్య కాలేజీతో పాటు నగరం నలుమూలలా టీమ్స్ ఏర్పాటు పట్ల సబిత హర్షం వ్యక్తంచేశారు. గతంలో 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 281కి పెరిగిందని, రూ.620 కోట్లు ఏటా ప్రభుత్వం ఖర్చు చేయడం ఆ వర్గాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి అందులో ఐదింటిలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టి పెద్దఎత్తున విద్యకు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
స్కూళ్ల ఆధునీకరణకు అధిక ప్రాధాన్యం..: ప్రభుత్వ స్కూళ్ళను ఆధునీకరించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజా బడ్జెట్ కేటాయింపుల్లో దీనికి ప్రాధాన్యమిచ్చింది. మన ఊరు–మన బడి, మన బస్తీ– మన బడి పేరుతో చేపట్టే ఈ కార్యక్రమానికి రూ.7,289 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. అయితే తొలి దశలో 9,123 స్కూళ్ళలో చేపట్టే 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,497 కోట్లు ఇతర పద్దుల నుంచి కేటాయించారు. కాగా రాష్ట్రావతరణ తర్వాత మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఎట్టకేలకు ఈ ఏడాది వర్సిటీ ఏర్పాటుకు అనుమతించింది. కార్యాచరణకు కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాథమిక అవసరాల కోసం రూ.100 కోట్లు కేటాయించింది. అదే విధంగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మరో రూ.100 కోట్లు కేటాయించింది.
ఎంత ఖర్చు చేస్తారో అనుమానమే
బడ్జెట్‌లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. విద్యకు గతంతో పోలిస్తే రూ.2,470 కోట్లు అదనంగా కేటాయించినట్లు కనిపించినా, వాస్తవానికి ఎంత ఖర్చు చేస్తారో అనుమానమేనని వారు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు అధికంగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువు అందించటానికి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించలేదని తెలిపారు.
ఉన్నత విద్యకు ఊతం : ప్రొఫెసర్ లింబాద్రి
ఉన్నత విద్య బలోపేతానికి రాష్ట్ర బడ్జెట్ తోడ్పడుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అభిప్రాయపడ్డారు. మహిళా విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించడంపై హర్షం వెలిబుచ్చారు. సరికొత్త బోధన విధానాలను అమలు చేయాలన్న ప్రయత్నాలు వేగం పుంజుకున్న నేపథ్యంలో ప్రభుత్వ కేటాయింపులు సత్ఫలితాల నిస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment