మాట్లాడుతున్న జస్టిస్ చంద్రు
సాక్షి, హైదరాబాద్: విద్య రంగంలోనూ బీజేపీ అదృశ్య ఎజెండాను అమలు చేస్తోందని, పేదలు విద్యకు దూరమయ్యే పరిస్థితి తెస్తోందని మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు విమర్శించారు. అందరికీ ఉచిత విద్య అందించాలన్న రాజ్యాంగస్ఫూర్తి దిశగా చేసిన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల చేతుల్లో ఉన్న విద్యను కేంద్రం లాక్కుని వ్యాపార వస్తువుగా మార్చిందన్నారు.
భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) 17వ జాతీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా ఆడిటోరియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రు మాట్లాడుతూ, అందరికీ విద్య, ఉపాధి, సమానత్వం అంశాలపై ఎస్‌ఎఫ్‌ఐ సభల్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని, కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం వెనుక రహస్య ఎజెండా ఉందని అన్నారు. విద్య ప్రాథమిక హక్కు అని చెప్పిన న్యాయస్థానాల్లోనే ప్రైవేటీకరణకు అనుకూలంగా తీర్పులు రావడం దురదృష్ణకరమని వ్యాఖ్యానించారు.
కూల్చినవారికి పద్మభూషణా?
బాబ్రీమసీదు కూల్చివేయబోమని, మత విశ్వాసాలను పరిరక్షిస్తామని చెప్పిన బీజేపీ నేతలు సుప్రీంకోర్టుకు లిఖిత పూర్వకంగా రాసిచ్చి, మసీదును కూల్చివేశారని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులకు పద్మభూషణ్ పురస్కారాలు ఇచ్చారని జస్టిస్ చంద్రు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకన్నా ఇది అత్యంత ప్రమాదకరమైందన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకొచ్చిన లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ కోరలు చాచిందని తెలిపారు.
ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అదానీ, అంబాని చేతుల్లోకి వెళ్తున్నాయని, గుజరాత్ పెట్టుబడిదారుల చేతుల్లోకి భారత నవరత్నాలు వెళ్లాయని పేర్కొన్నారు. బీజేపీ వేగంగా హిందూత్వ ఎజెండాను అమలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ లౌకికతత్వానికి ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గవర్నర్ దర్బార్ పేరుతో హిందూత్వ ఎజెండాను అమలు చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
దేశ ఐక్యత ప్రమాదంలో ఉందని, ఒకే దేశం, ఒకే భాష, ఒకే నేత నినాదంతో మోదీ సర్కార్ సంఘ్ పరివార ఆలోచన విధానాలను బలవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రానురాను ఒకే భోజనం అనే మాట కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను, జనరల్ సెక్రటరీ బిస్వాస్, ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థ సర్వనాశనం
విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలను నిలిపివేసిందని, హాస్టళ్లను కూడా మూసివేసిందని ఆరోపించారు. మహాసభలకు రాకుండా గుజరాత్ రాష్ట్ర విద్యార్థి నాయకులను అక్కడి బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు.
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహిళా కన్వీనర్ థీప్సితా ధరమాట్లాడుతూ సోషలిజం కోసం ఎస్‌ఎఫ్‌ఐ పని చేస్తుందన్నారు. విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన ఎస్‌ఎఫ్‌ఐ నేత ధీరజ్ అమరజ్యోతిని అతని తండ్రి రాజేంద్రన్‌కు అందించారు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment