పది నెలల్లో కాళేశ్వరం పూర్తి
వచ్చే జూన్‌లో సాగునీరిచ్చి తీరుతాం: మంత్రి హరీశ్
సాక్షి, జగిత్యాల: పదినెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకుని.. వచ్చే జూన్ నాటికి తెలంగాణలోని 13 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగుకు నీరందించి తీరుతామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లను అతి తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలో.. ఎక్కువ ఆయకట్టుకు తరలించేలా సీఎం కేసీఆర్ ప్రారంభించిన వరద కాల్వ ఎస్సారెస్పీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి, ధర్మపురిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసం గించారు. కాళేశ్వరం పూర్తయితే.. ఉత్తర తెలంగాణలో బోరు ఎండుడు.. బావిలో నీరు దంగుడు ఉండదన్నారు. ‘ఒకప్పుడు ఎస్సారెస్పీ నిండి.. పొర్లితే.. వరద కాల్వలోకి నీళ్లు పారితేనే మనకు నీళ్లొచ్చేవి.. కానీ, మనం వరదకాల్వనే రిజర్వాయర్‌గా మారుస్తున్నాం. మధ్యలో మూడు క్రాస్ రెగ్యులేటర్ల ఉన్నాయి.
మనం కాళేశ్వరం నీటిని రిజర్వాయర్‌లో నింపితే అవి రివర్స్‌లోకి వెళ్లి ఎస్సారెస్పీలో పడతాయి.దీంతో వరదకాల్వ.. కాకతీయ కాల్వ మధ్య ఎండిపోతోన్న లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయి..’ అన్నారు. మిడ్‌మానేరుకు కొబ్బరి కాయ కొట్టింది తామే అని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు 2005 నుంచి 2015 వరకు తొమ్మిదేళ్ల కాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.106 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ.407 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేసిన విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ ఏడాది కచ్చితంగా 10 టీఎంసీల నీళ్లు మిడ్‌మానేరులో నింపడమే కాకుండా హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు ఈ ఏడాది నీరందిస్తామని స్పష్టం చేశారు.
మండలానికో కార్యాలయం...
రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాల్లో వెలుగుచూస్తున్న అవినీతి ఆరోపణలపై దృష్టిసారించిన సీఎం త్వరలోనే మండలానికో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారని హరీశ్ తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.