హైదరాబాద్ చేరుకున్న కన్హయ్య.. తీవ్ర ఉద్రిక్తత | kanhaiya kumar reaches hyderabad, tense prevailed in hcu | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న కన్హయ్య.. తీవ్ర ఉద్రిక్తత

Published Wed, Mar 23 2016 11:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

హైదరాబాద్ చేరుకున్న కన్హయ్య.. తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ చేరుకున్న కన్హయ్య.. తీవ్ర ఉద్రిక్తత

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకుమార్ హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతడికి పలువురు విద్యార్థులతో పాటు సీపీఐ నేత నారాయణ స్వాగతం పలికారు. తాను ముందుగా రోహిత్‌ తల్లిని, అతడి సోదరుడిని కలుస్తానని, సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బహిరంగ సభకు హాజరై అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తానని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ కన్హయ్య చెప్పాడు. పోలీసులు అనుమతిస్తారనే నమ్మకం తనకు ఉందని, విద్యార్థులకు సమావేశం ఏర్పాటుచేసుకునే హక్కు ఉందని తెలిపాడు. క్యాంపస్‌లో సామాజిక న్యాయం కోసం, రోహిత్ ఆత్మకు శాంతి కలగడానికి, అతడి కలను నెరవేర్చడానికి ఉద్యమం కొనసాగించడం తన లక్ష్యమని అన్నాడు. కన్హయ్య సందర్భంగా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. దాంతో అతడిని అరెస్టు చేస్తారన్న అనుమానాలు తలెత్తినా, అలాంటి ఉద్దేశం ఏదీ లేదని విమానాశ్రయంలో ఉన్న పోలీసులు చెప్పారు.

అయితే, అసలు కన్హయ్యను హెచ్‌సీయూలోకి అనుమతిస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. మరోవైపు దీక్ష చేస్తానని చెబుతున్న రోహిత్ తల్లిని కూడా యూనివర్సిటీ ప్రాంగణంలోకి రానిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు కూడా కఠినమైన చర్యల దిశగా వెళ్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనివర్సిటీకి సంబంధించినవాళ్లు తప్ప మీడియా, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, ఇతర విద్యార్థి సంఘాల నేతలు ఎవరినీ ప్రాంగణంలోకి అనుమతించబోమంటూ హెచ్‌సీయూ రిజిస్ట్రార్ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. మెయిన్ గేటు తప్ప అన్నింటినీ మూసేస్తామని అందులో తెలిపారు. తగిన భద్రత కల్పించాల్సిందిగా కోరారు. ఇప్పటికే హెచ్‌సీయూ ప్రాంగణం మొత్తం పోలీసు పహరాతో కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఒక వ్యక్తి ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని పోలీసులు భావిస్తే అతడిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం, కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం లాంటివి ఇంతకుముందు జరిగాయి. ఇప్పుడు కూడా కన్హయ్య విషయంలో పోలీసులు అలాగే చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు మాత్రం గట్టి పట్టుదలతోనే కనిపిస్తున్నాయి. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ ప్రాంగణంలోనే సభ నిర్వహించుకుంటామని, తమకు వేరే వేదిక ఏమీ లేదని నాయకులు బుధవారం ఉదయం కూడా స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీలో మళ్లీ వీసీ అప్పారావు ప్రవేశించడం వల్లే ఉద్రిక్తతలు చెలరేగాయని వాళ్లు ఆరోపించారు.

మరోవైపు విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ తన మద్దతు తెలిపింది. సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు బుధవారం ఉదయం యూనివర్సిటీ గేటు వరకు వెళ్లి అక్కడ కాసేపు ఆందోళన నిర్వహించారు. గతంలో ఎన్ఎస్‌యూ అధ్యక్షుడిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి కూడా యూనివర్సిటీ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement