
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే
టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రెండు రోజులుగా ఫాంహౌస్‌లోనే ఉన్న కేసీఆర్.. పలువురు నేతలతో మంతనాలు నిర్వహించిన తర్వాత పార్టీ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌లకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వాస్తవానికి టీఆర్ఎస్‌లో రాజ్యసభ సీటు కోసం పోటీ గట్టిగానే కనిపించింది. సీఎల్ రాజం, కేసీఆర్ సన్నిహితుడు దామోదరరావు తదితరుల పేర్లు కూడా వినిపించినా, అన్ని లెక్కలను దృష్టిలో పెట్టుకుని పై రెండు పేర్లను కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డి.శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పదవిలో కేబినెట్ హోదాలోనే ఉన్నా, కేంద్రంలో ఆయనకున్న సంబంధాలను పరిగణనలోకి తీసుకుని.. కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించే పాత్ర దృష్ట్యా ఆయనను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు.
ఇక కెప్టెన్ లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు ఉన్న బలాన్ని బట్టి చూస్తే ఇద్దరిని గెలిపించుకునే బలం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నా, ప్రతిపక్షాల సభ్యులతో కలుపుకొన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ అవకాశం దాదాపు లేనట్లే కనిపిస్తోంది. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు పాలేరు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి జరిగే ఎన్నికకు మెదక్ జిల్లాకు చెందిన మైనారిటీ నేత ఫరీదుద్దీన్‌కు అవకాశం కల్పించారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మైనారిటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.