సొంతింటి కల... నెరవేరిన వేళ!
* పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
* ఖైరతాబాద్‌లో 7వేలు, మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,300 మందికి...
* జంట జిల్లాల్లో 40 వేల మందికి లబ్ధి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పేదల నిరీక్షణ ఫలించింది. వీరి సొంత గూడు కలను తెలంగాణ సర్కారు నిజం చేసింది. హైదరాబాద్ జిల్లాలో రూ.పది కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి 20,025 కుటుంబాలకు, రంగారెడ్డి జిల్లాలో 20 వేల మందికి ఇళ్ల పట్టాలను శుక్రవారం పంపిణీ చేసింది.
తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రేటర్‌లో లక్ష ఇళ్ల పట్టాలు పంపిణీ లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎన్‌బీటీ నగర్‌లో 7 వేలకు పైగా కుటుంబాలు, మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,300 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చెరువు శిఖం, దేవాదాయ, వక్ఫ్ భూముల్లోని ఇళ్లకు పట్టాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు.
కోర్టు కేసులు, ప్రైవేట్ భూముల్లో ఉన్న నివాసాలకు సంబంధించి పట్టాలు ఎలా ఇవ్వాలనే అంశమై ఆలోచిస్తున్నామన్నారు. కోర్టు కేసుల్లో భూములు గెలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ భూములను కోనుగోలు చేసైనా పేదలకు న్యాయం జరిగేలా కృషి చేస్తాన ని చెప్పారు. నగరంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఆక్రమిత స్థలాల్లో నివసించే కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం దశల వారీగా పూర్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని, మహేందర్‌రెడ్డి, ఎంపీలు మాల్లారెడ్డి, కేశవరావు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి ఆక్రమిత భూముల్లో నివాసముంటూ.... పట్టాల కోసం కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని... సీఎం కేసీఆర్ దయవల్ల ఇళ్ల పట్టాలు వస్తున్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన
ఎన్‌బీటీ నగర్‌లో రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాలుకు శుక్రవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ స్థలంలో ఉంటున్న ఇంటిని కోల్పోతున్న మల్లమ్మ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి అప్పగించారు. స్థానిక మహిళా సంఘం నాయకురాళ్లు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
నియోజకవర్గాల్లో...
*నగరంలోని మలక్‌పేట్ నియోజకవర్గంలో114, అంబర్‌పేట్ నియోజకవర్గంలో 503, చార్మినార్‌లో 112 మందికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పట్టాలు పంపిణీ చేశారు.
* చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 393, యాకత్‌పురలో 161, బహదుర్‌పురాలో 26 , నాంపల్లి నియోజకవర్గంలో 381, కార్వాన్‌లో 793, గోషా మహల్‌లో 174 మందికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పట్టాలు అందజేశారు.
* ముషీరాబాద్ నియోజకవర్గంలో 1186 మందికి, జూబ్లీహిల్స్‌లో 5314 మందికి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు.
* సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సనత్‌నగర్ నియోజకవర్గంలోని 495 మందికి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇళ్ల పట్టాలు అందించారు.
* మారేడుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 1910 మందికి, కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 646 మందికి మంత్రి పద్మారావు పట్టాలు పంపిణీ చేశారు.
* నగర శివారు మండలాల్లోని వివిధ ప్రాంతాల్లోనూ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.