ఆకాశహర్మ్యాల వైపు అడుగులు | KCR plans to lift city's image with skyscrapers around Hussainsagar | Sakshi
Sakshi News home page

ఆకాశహర్మ్యాల వైపు అడుగులు

Published Sun, Nov 16 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

ఆకాశహర్మ్యాల వైపు అడుగులు

ఆకాశహర్మ్యాల వైపు అడుగులు

* ముగిసిన భూముల సర్వే
* రికార్డులు పరిశీలిస్తున్న రెవెన్యూ శాఖ
* పొంతన కుదరని లెక్కలు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. సాగర్ చుట్టూ ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించేందుకు చేపట్టిన సర్వే శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాం శర్మ, భూ సర్వే డిప్యూటీ డెరైక్టర్ గోపాల్‌రావు, త హశీల్దారులు శ్రీనివాసరెడ్డి, సుజాతతో పాటు 16 మంది ల్యాండ్ సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

ఈటీసీ (ఎలక్ట్రానిక్ టోటన్ స్టాటిక్స్) మిషన్ సహకారంతో మాన్యువల్ సర్వే నిర్వహించారు. సాగర్ చుట్టూ 26 పార్శళ్లలో(ప్రాంతాల్లో) సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు మాతాజీ నగర్, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలమని తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూములు వివాదాస్పదంగా ఉండడంతో పాటు, కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.
 
సర్వే చేసిన ప్రాంతాలివే...
సెయిలింగ్ క్లబ్, యూత్ హాస్టల్ షెడ్లు, సతీష్ చంద్రమోడి, బుద్ధభవన్ పక్కనున్న ఖాళీ స్థలం, రాణి గంజ్ బస్ డిపో తూర్పున ఉన్న ఖాళీ స్థలం, అంబేద్కర్ నగర్ విగ్రహం, అంబేద్కర్ నగర్ అండర్ బిడ్జి నుంచి ఎంఎంటీఎస్ సంజీవయ్య పార్కు వరకు సర్వే చేశారు. పీవీ ఘాట్ ఎదురుగా ఉన్న ప్రాంతం, పాటిగడ్డ ఎస్‌టీపీ, పార్కు హోటల్ సమీపంలోని ఆదిత్య బిల్డర్స్ వద్దనున్న ఖాళీ స్థలం, పీవీ ఘాట్ నుంచి జలవిహార్ మధ్య స్థలం, పీపుల్స్ ప్లాజా ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలం తదితర ప్రాంతాల్లో సర్వే చేశారు.

ఓరిస్ హోటల్ ఎదురుగా ఉన్న కుందన్‌బాగ్ ఖాళీ స్థలం, ఐమాక్స్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలం, సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా, టిప్‌టాప్, మింట్ కాంపౌండ్, ముద్రణాలయం, లుంబినీ పార్కు, బోట్స్ క్లబ్, లేజర్ ఫో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వద్దనున్న స్థలం, మారియట్ హోటల్, ట్యాంక్‌బండ్ మధ్య గల స్థలం, త హశీల్దార్ కార్యాలయం, ట్యాంక్‌బండ్ మధ్య స్థలం, భాస్కర్‌రెడ్డి ఎన్‌వోసీ, రాఘవ సదన్, నర్సింగ్ కాలేజి, దిల్‌కుష్ గెస్ట్‌హౌస్, గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌస్, హోమ్ సైన్స్ కళాశాల, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తదితర ప్రాంతాల్లో  రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.

శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అధికార యంత్రాంగం దీనికి అనుగుణంగా భూ వివరాల సేకరణకురికార్డులు పరిశీలిస్తున్నారు. సర్వే వివరాలను రికార్డులతో సరి చూసుకోవటం ద్వారా సాగర్ చుట్టూ ప్రభుత్వ ఖాళీ స్థలం ఎంత ఉందన్న విషయంపై రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దీనికి ముందు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
 
ఇంకా తేలని లెక్క
సాగర్ చుట్టూ ఉన్న 26 ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలం ఎంతన్నది పక్కాగా లెక్క తేలలేదు. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి పొంతన లేకపోవడం అధికారులను అయోమయానికి గురిచేసింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో అనేక చోట్ల శాశ్వత నిర్మాణాలు రూపుదాల్చగా, మరికొన్ని చోట్ల ఆక్రమణదారులు దర్జాగా అనుభవిస్తున్న తీరు అధికారులను విస్మయానికి గురిచేసింది. అనే క స్థలాలపై కోర్టులో వివాదాలు నడుస్తున్నట్లు తేలింది.

కిమ్స్ ఎదురుగా సుమారు 32 ఎకరాలు సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండగా...అందులో 10 ఎకరాలకు పైగా ఆక్రమణ చెరలో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌చుట్టూ ఇతమిత్థంగా ఎంత భూమి ఉందన్న విషయాన్ని నిగు ్గతేల్చేందుకు కసరత్తు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించేందుకు రెవెన్యూ అధికారులు హడావుడి చేస్తున్నారు.
 
బీపీపీ స్థలాలపై ఆరా
హుస్సేన్‌సాగర్, చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పరిధిలో ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్నే సాగర్ పరిశుభ్రత, పార్కుల నిర్వహణకు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు సాగర్ చుట్టూ అభివృద్ధికి బాటలు వేస్తుండటంతో అసలు బీపీపీ ఆధ్వర్యంలో ఎంత భూమి ఉందన్న విషయమై ప్రభుత్వం ఆరా తీసింది. సాగర్ తీరాన విలువైన భూమిని ఏఏ సంస్థలకు, ఎన్నేళ్ల కాలపరిమితికి లీజ్‌కు ఇచ్చారు? వాటిలో ఎలాంటి నిర్మాణాలున్నాయి? లీజ్ గడువు ముగిసిన భూమి ఎంత ఉంది.?  

ఏఏ భూములపై కోర్టు వివాదాలున్నాయి? ఏటా ఎంత ఆదాయం వస్తుంది? వంటి విషయాలపై బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులను సమాచారం అడిగారు. రికార్డుల ప్రకారం సుమారు 270 ఎకరాలకు పైగా బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఉన్నట్లు వారు తేల్చారు. వీటిలో ఎస్టీపీలు, పార్కులు అభివృద్ధి చేయడంతో పాటు కొంత భూమిని హోటళ్లు, థియేటర్లు, పార్కింగ్, ఎమ్యూజ్‌మెంట్, రిక్రియేషన్ వంటి వాటికి కేటాయించినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement