ఇది అందరి విజయం | KCR responds on ghmc elections | Sakshi
Sakshi News home page

ఇది అందరి విజయం

Published Sat, Feb 6 2016 3:03 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో విక్టరీ సింబల్ చూపుతున్న సీఎం కేసీఆర్ - Sakshi

శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో విక్టరీ సింబల్ చూపుతున్న సీఎం కేసీఆర్

  • పేదల ఎజెండాయే.. మా ఎజెండా: కేసీఆర్
  • మేం కష్టపడితే వచ్చింది కాదు.. ప్రజలు ఇష్టపడి ఇచ్చిన విజయమిది
  • అద్భుతమైన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు
  • జీహెచ్‌ఎంసీ మేనిఫెస్టోను తు.చ. తప్పకుండా అమలు చేస్తాం
  • హైదరాబాద్‌ను నిజమైన విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
  • ప్రతిపక్షాలు ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
  •  
    సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజలు అంత అలవోకగా విజయం ఇవ్వరు. ఇది ప్రజలు ఇష్టపడితే వచ్చిన విజయం. మేం కష్టపడితే వచ్చింది కాదు. మా ఎజెండా.. పేదల ఎజెండా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా మేం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను తూ.చ . తప్పకుండా అమలు చేస్తాం. జంట నగర వాసులకు లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తం. ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరుపుతం. మేనిఫెస్టోలోని అంశాలన్నీ మాకు ముఖ్యమే. డబుల్‌బెడ్ రూం ఇళ్లకు టాప్ ప్రియారిటీ ఉంటుంది..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం రాత్రి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్‌లో సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
     
    శిరసు వంచి నమస్కరిస్తున్నా..
    చరిత్ర తిరగరాస్తూ.. గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని స్థానాలిచ్చి అద్భుతమైన విజయం చేకూర్చిన జంట నగర ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. కార్పొరేటర్లుగా గెలిచిన వారికి అభినందనలు. అందరి కృషి వ ల్లే ఈ విజయం దక్కింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. గత చరిత్రలో ఏ పార్టీ చూసినా... 52 స్థానాలకు మించి రాలేదు. హైదరాబాద్ నగర చర్రిత చూస్తే ఏ ఒక్క పార్టీ నేరుగా అధికారం చేపట్టలేదు.

    ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు. టీఆర్‌ఎస్ నేతలకు నాది ఒక్కటే విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితుల్లో గర్వం, అహంకారం రావొద్దు. ప్రజలు ఎంత గొప్ప విజయం అందిస్తే.. అంత అణకువతో పోవాలి. పార్టీ నాయకత్వం, ప్రభుత్వంపై బాధ్యత చాలా పెరిగింది. నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలపైనా చాలా బరువు మోపారు. హైదరాబాద్ ప్రజలకు నాది ఒక్కటే వాగ్దానం. ఎంత గొప్ప మెజారిటీ ఇచ్చారో.. అంతే గొప్పగా సేవ చేసి నిరూపించుకుంటాం.
     
    ఇక్కడి వాళ్లంతా మా బిడ్డలే..
    పోలింగ్ ముగిశాక నన్ను కలిసిన మంత్రులు.. మన నుంచి  ప్రజలు ఎక్కువగా రెండు పనులు ఆశిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా పేద ప్రజలు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఆశిస్తున్నట్లు చెప్పారు. కచ్చితంగా రాబోయే బడ్జెట్‌లో పెట్టి, లక్ష ఇళ్లు కడతాం. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. అదే తరహాలో జీహెచ్‌ఎంసీ మేనిఫెస్టోను అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొందరు అపోహలు సృష్టించారు.
     
    సెటిలర్స్‌ను, ఆంధ్రా వాళ్లను ఏదో చేస్తామని, టీఆర్‌ఎస్ అంటే ఏదో భూతమని భయపెట్టారు. కొన్ని పిచ్చి ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా చేయని ప్రయత్నం లేదు. హైదరాబాదీలంతా టీఆర్‌ఎస్ వైపే, కేసీఆర్ వైపే ఉన్నామని పిడికిలెత్తి స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా మా బిడ్డలే. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రా ప్రాంత సోదరులు కావొచ్చు వారంద రినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. ఏ ప్రభుత్వానికైనా ప్రథమ కర్తవ్యం తన రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ, ఉపాధి కల్పించడం. ఆ కర్తవ్యం మా గుండెల్లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికైనా అపోహలు ఉన్నా అవి నేటితో పటా పంచలు అయ్యాయి.
     
    4 వెయ్యి పడకల ఆసుపత్రులు
    డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు జంట నగరానికి రెండు రిజర్వాయర్లను శరవేగంగా చేపట్టి, తాగునీటి సమస్య, పీడ లేకుండా చేస్తాం. హైదరాబాద్‌లో ఒక్క సెకను కూడా విద్యుత్ పోకుండా అందిస్తం. హైదారబాద్ నెవర్ స్లీప్స్ మాదిరిగా తయారు చేస్తాం. శాంతి భద్రత విషయంలో రాజీ ధోరణి ఉండదు. ఎవరైనా, ఎంతపెద్ద వారైనా కఠినంగా డీల్ చేస్తం. రాజీ పడం.
     
    స్కై వేలు, మల్టీ లెవల్  ఫ్లైఓవర్స్, సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్, డ్రెయినేజీ వ్యవస్థను బాగు చేయడం వంటి చర్యలు చేపడతాం. హైదరాబాద్‌లో 50 ఏళ్లుగా వింటున్నాం. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల పేర్లే వింటున్నం. మరోటి లేదు. సమైక్య రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం అందించే ఆసుపత్రులు ఈ రెండు తప్ప మరోటి లేదు. అవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి.
     
    కింగ్ కోఠీ ఆసుపత్రిని వెయ్యి పడకలకు అప్‌గ్రేడ్ చేస్తాం. మరో మూడు వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను తలదన్నేలా వీటిని నిర్మిస్తం. ఎమ్మారై సహా అన్ని రకాల పరీక్షలను జరిపేలా కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ఏడాదిలోనే నిర్మిస్తం. ప్రస్తుతం నగరంలో ఉన్న రెండు ఆసుపత్రుల సంఖ్యను ఆరుకు పెంచుతం. ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న స్థలంలోనే కొత్త భవనాలు నిర్మిస్తం.
     
    ఇప్పటికే మొదలు పెట్టిన కూరగాయల మార్కెట్లు, శ్మశాన వాటికలు, బస్‌బేలు, టాయిలెట్లు, కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తం. ‘ట్రూలీ గ్లోబల్ సిటీ-హైదరాబాద్’ అని పేరు వచ్చేలా నిజమైన విశ్వనగరంగా తీర్చి దిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.
     
    ఒక్క చెవి నారాయణను చూడలేను
    ప్రతిపక్షాలకు చేసే మనవి ఒక్కటే. ప్రజా తీర్పును కోరే సమయంలో అవాకులు చవాకులు కాకుండా, అసంబద్ధమైన వ్యక్తిగత విమర్శలు కాకుండా సరైన పంథాలో, సహేతుక విమర్శలు చేస్తే  బావుంటుంది. కానీ చాలా మంది చాలా మాట్లాడారు. ఇవ్వాళ టీఆర్‌ఎస్ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉంది అని హైదరాబాదీలు నిర్ణయం చేశారు. చంద్రబాబు, బీజేపీ నాయకులు ఏవేవో అన్నారు. కాంగ్రెస్ నాయకులైతే ఇష్టమొచ్చిన పద్ధతిలో మాట్లాడారు.
     
    వాటన్నింటినీ తోసి పుచ్చి హైదరాబాద్ ప్రజలు కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా అద్భుతంగా గెలిపించారు. డంబాచారాలు మాట్లాడే వారికి సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. సీపీఐ నారాయణ నా మిత్రుడు. ఒక్కచెవి నారాయణను చూడలేను. ఆయన జోలికి ఎవరూ వెళ్లొద్దు. రెండు చెవుల నారాయణనే చూడాలి. ఆయన ప్రజా కార్యకర్త. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అయన తెరువు ఎవరూ పోవద్దు.
     
    నిర్మాణాత్మక సలహాలివ్వండి..
    విపక్షాలకు నా విజ్ఞప్తి ఏంటంటే.. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. కొత్త రాష్ట్రం మనది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోవాలి. వరంగల్‌లో మీరు అడ్డదిడ్డంగా మాట్లాడితే.. అక్కడి ప్రజలు డిపాజిట్లు రాకుండా చేశారు. హైదరాబాద్‌లో మీరెన్ని అవాకులు మాట్లాడినా.. సింగిల్ డిజిట్‌తో సరిపెట్టారు. ఈ పరిస్థితిని గమనించి, నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి ముందుకు సాగుదాం.
     
    కొత్త రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుకుందాం. ప్రజల  సేవలో తరిద్దాం. అర్థం పర్థం లేని విమర్శలు, వ్యక్తిగత నిందారోపణలు ఇప్పటికైనా మానుకుని ప్రజలు ఇచ్చిన ఫలితం గమనించండి. వరంగల్ ఫలితం తర్వాతే మారుతారనుకున్నా.. కనీసం హైదరాబాద్ ఫలితం తర్వాతనైనా మీరు మారుతారాని ఆశిస్తున్నాం.
     
    కలిసి వెళ్తేనే అభివృద్ధి..

    పరేడ్ గ్రౌండ్‌లో చెప్పిన మాటలను కార్పొరేటర్లు గుండెల్లో పెట్టుకోవాలి. జీహెచ్‌ఎంసీలో లంచం ఇచ్చే అవసరం లేకుండా ఇంటి పర్మిషన్ తెచ్చుకునేలా పనిచేయాలి. ఆ రోజు వస్తేనే మనం గెలిచిన గెలుపునకు విలువ ఉంటుంది. ఎన్నికల సందర్భంలో కొద్దిపాటి ఆవేశాలకు గురైనా స్పోర్టివ్‌గా తీసుకుని అలాయ్ బలాయ్ తీసుకోవాలి. అందరినీ కలుపుకొని వెళితేనే అభివృద్ధి సాధ్యం.
     
    ఎవరి ఒళ్లు వారు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిది. పార్టీ నేతలు, గెలిచిన కార్పొరేటర్లతో చర్చించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై నిర్ణయం చేస్తం.
     
    సెక్షన్ 8ని ప్రజలు తిరస్కరిస్తరు..
    ప్రజలు ప్రతిపక్షాలను ఎంత ఘోరంగా తిరస్కరించించారో సెక్షన్ 8ని కూడా అలాగే తిరస్కరిస్తరు. అర్థం లే ని ప్రేలాపనలు మానుకోవాలి. ఎక్స్ అఫీషియో ఆర్డినెన్స్ వేస్ట్ కాదు. భవిష్యత్తులో పనిచేస్తుంది. ఎన్నికను కుదిలించాలనుకుంది కూడా సంస్కరణల కోసమే. తక్కువ సమయంలో అయితే బావుంటదని భావించినం. హైకోర్టు వేరే విధంగా ఆదేశించింది కాబట్టి.. ఆ తీర్పును గౌరవించి ఆ ప్రకారమే ఎన్నికలను నిర్వహించాం.

    ఎక్స్ అఫీషియో మెంబర్స్ విషయంలో ఇది కొత్త చరిత్ర కాదు. నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి వరకు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఓటింగులో పాల్గొన్నారు. అది ఈరోజు అవసరం లేని పరిస్థితే కనిపిస్తోంది. భవిష్యత్ కోసమైనా సరే చట్టంలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని తెచ్చాం.
     
    చరిత్ర తిరగరాస్తూ.. గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని స్థానాలిచ్చి అద్భుతమైన విజయం చేకూర్చిన జంట నగర ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా.  అందరి కృషి వల్లే ఈ విజయం దక్కింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. గత చరిత్రలో ఏ పార్టీ చూసినా... 52 స్థానాలకు మించి రాలేదు. ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు.
     - ముఖ్యమంత్రి కేసీఆర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement