బోగస్ విద్యాసంస్థలను ఏరిపారేస్తాం: కేసీఆర్
బోగస్ విద్యా సంస్థలను కచ్చితంగా ఏరేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాణ్యమైన విద్య, విజిలెన్స్ తనిఖీలు వంటి అంశాలపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత ప్రమాణాలతో విద్యాసంస్థలు నడవాలన్నారు. బోగస్ విద్యాసంస్థ ఒక్కటి కూడా ఉండకూడదని చెప్పారు. విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.
విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చిన లోపాలను సవరించుకునే అవకాశాన్ని విద్యాసంస్థలకు ఇస్తామన్నారు. విద్యార్థులే లేకుండా కాలేజీలు నడపటం దారుణమని చెప్పారు. వేలంవెర్రిగా ఒకే కోర్సును విద్యార్థులు చేయడం వల్లే.. నిరుద్యోగ సమస్య తలెత్తుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి సమస్యలపై చర్చించినట్టు చెప్పారు. తనిఖీలు గురించి ఆందోళన వద్దన్నారు. లోపాలు సరిదిద్దుకునేందుకు తగిన సమయం ఇస్తానన్నారని తెలిపారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని కేసీఆర్ సూచించినట్టు ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ తెలిపింది.