ఉల్లం‘ఘనులకు’ ఇంటి దొంగల వత్తాసు
సాక్షి, అమరావతి: గనులను కొల్లగొట్టిన అక్రమార్కులకు మైనింగ్ శాఖలోని కొందరు అధికారులే అండగా నిలవడం ఉత్తరాంధ్రలో చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలోని మెటల్ క్వారీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై మైనింగ్ విజిలెన్స్ విభాగం 10 రోజులుగా చేస్తున్న తనిఖీలకు అక్కడి మైనింగ్ అధికారులు అడుగడుగునా అడ్డు తగులుతున్నట్టు తేలింది. తనిఖీలకు నేతృత్వం వహిస్తున్న విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి పట్ల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించగా.. జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు ఏకంగా దాడికి యత్నించటం కలకలం రేపింది.
ఫైళ్లు ఇవ్వకుండా.. మాఫియాకు పాదాక్రాంతం
అనకాపల్లి మండలంలోని 30 క్వారీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు రాష్ట్రంలోనే బడా కంపెనీలకు చెందిన క్వారీల్లో తనిఖీలు చేసి ఉల్లంఘనల్ని బయటపెడుతుండడంతో మైనింగ్ మాఫియా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయినా విజిలెన్స్ అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో అనకాపల్లి ఏడీ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, ఇతర ప్రాంతాల్లోని పలువురు మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలకు అడ్డంకులు కల్పించారు. తనిఖీలు చేస్తున్న క్వారీలకు సంబంధించిన ఫైళ్లు, అనుమతులు, ఇతర వివరాలు ఇవ్వకుండా అక్కడి అధికారులు రోజుల తరబడి తప్పుకుని తిరుగుతున్నట్టు సమాచారం.
మరోవైపు విజిలెన్స్ అధికారుల తనిఖీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మైనింగ్ మాఫియాకు చేరవేస్తూ అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఇటీవల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయానికి వెళ్లి ఫైళ్లు ఇవ్వాలని కోరారు. విజిలెన్స్ బృందం మూడు గంటలకు పైగా ఆ కార్యాలయంలో వేచి ఉన్నప్పటికీ.. ఫైళ్లు ఇవ్వకుండా తనిఖీలను తప్పుపట్టేలా మాట్లాడుతూ అక్కడి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడు విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఉన్నట్టుండి ఏడీ మొహంపై తాను తాగుతున్న టీని విసిరారు. ఆ తర్వాత దాడికి ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ప్రతాప్‌రెడ్డి విజయవాడలోని మైనింగ్ శాఖ సంచాలకులు వెంకటరెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ జరిపారు. అనకాపల్లి జియాలజిస్ట్ విఘ్నేశ్వరుడుదే తప్పని నిర్థారించి వెంటనే ఆయనను సస్పెండ్ చేసి పని చేస్తున్న ప్రాంతం నుంచి అనుమతి లేకుండా వెళ్లకూడదని ఆదేశించారు.
విజిలెన్స్ ఏడీ లక్ష్యంగా మాఫియా స్కెచ్
ఉత్తరాంధ్ర మైనింగ్ మాఫియాకు చెందిన శ్రీనివాస చౌదరి, ఎంఎస్ రెడ్డి, వాణీ చౌదరికి చెందిన కంపెనీలతోపాటు ఇతర కంపెనీలతోనూ అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు లాలూచీపడినట్టు స్పష్టమైంది. వారి మద్దతుతోనే విజిలెన్స్ ఏడీపై జియాలజిస్ట్ దాడి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం బహిర్గతమవడంతో ఇప్పుడు నేరుగా మాఫియాలోని వ్యక్తులే విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డిని అడ్డుకునేందుకు స్కెచ్ వేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆయన్ను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తనిఖీలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రతాప్‌రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. విజిలెన్స్ బృందాలకు సైతం భద్రత పెంచి తనిఖీల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు సైతం అనకాపల్లి మైనింగ్ వ్యవహారాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్టు సమాచారం.