కిమ్స్‌లో సెరిబ్రల్‌పాల్సీ బాధితునికి శస్త్రచికిత్స
ఈ తరహా శస్త్రచికిత్స దేశంలోనే మొట్టమొదటిదని వైద్యుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ (శరీర కదలికలను నియంత్రించే శక్తిని మెదడు కోల్పోవడం)తో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్సతో కృత్రిమ తుంటిని విజయవంతంగా అమర్చారు. ఈ తరహా చికిత్సను అందించడం దేశంలోనే ఇది తొలిసారని వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కిమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు వెల్లడించారు. వరంగల్ జిల్లా తొర్రూర్‌కు చెందిన శ్రీశైలం(40) పుట్టుకతోనే సెరిబ్రల్‌పాల్సీతో బాధపడుతున్నాడు. మూడేళ్ల క్రితం ప్రమాదశాత్తూ జారీ కిందపడిపోవడంతో తుంటి ఎముక విరిగి కాళ్లు, చేతులు చచ్చు బడి పోయాయి.
వైద్య పరిభాషలో దీన్ని (క్వాడ్రీపారిసిస్)గా పిలుస్తారు. దీంతో గత మూడేళ్ల నుంచి ఆయన పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. ఏడాది క్రితం కిమ్స్‌లోని ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఉదయ్‌కృష్ణను కలిశాడు. పరీక్షించి, పలు వైద్య పరీక్షలు చేయించారు. బాధితుని తుంటికి సరితూగే కృత్రిమ బాల్‌ను విదేశాల్లో తయారు చేయించారు. ఇటీవలే ఆయనకు మెటికులస్ ప్లానింగ్ ద్వారా శస్త్రచికిత్స చేసి దెబ్బతిన్న తుంటి భాగంలో కృత్రిమ తుంటిని అమర్చారు. చికిత్స చేసిన పది రోజులకే ఆయనస్వయంగా లేచి నిలబడుతున్నాడని, మరో మూడు నెలల్లో ఆయన స్వయంగా లేచి నిలబడటంతో పాటు ఎవరి సహాయం అవసరం లేకుండానే నడ వగలడని వైద్యులు స్పష్టం చేశారు. చికిత్సకు రూ. 6 లక్షలు ఖర్చు అవుతుండగా, రోగి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తాము కేవలం రూ.2 లక్షలకే ఈ శస్త్రచికిత్స చేసిన ట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గోపి పాల్గొన్నారు.