KiMs doctors
-
సిరివెన్నెల మృతికి కారణాలు ఇవే
Sirivennela Seetharama sastry Death Reasons: ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) మృతిపై కిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి ఎండీ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తియాల్సి వచ్చింది. మళ్లీ గతవారం కిందట మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకడంతో ఆపరేషన్ చేసి సగం తొలగించాం. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారు. ఐదు రోజుల నుంచి ఎక్మా మిషన్ మీద ఉన్నారు. ఆ తర్వాత క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకి చివరకు మంగళవారం సాయంత్రం 4: 07 గంటలకు తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు. -
కరోనా వైరస్: జ్వరంతో 5 రోజులు దాటితే ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వచ్చి మూడురోజులు దాటినా తగ్గలేదంటే జాగ్రత్త పడాల్సిందే. ఐదురోజులు దాటితే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అందువల్ల మూడురోజులు దాటగానే అప్రమత్తమై ఎవరో ఒక వైద్యుడినో, ఆన్లైన్ కన్సల్టేషనో కాకుండా స్పెషలిస్ట్‌ను కలిసి వైద్యం చేయించుకోవాలి. మూడు రోజులకే జాగ్రత్త పడితే మొదటివారంలో స్టెరాయిడ్స్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకోవచ్చు. త్వరగా కోలుకుంటారు. లేని పక్షంలో రెండోవారంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి సైటోకాన్ స్టార్మ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలతో ప్రాణాలకు ముప్పు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇప్పటికీ ఔట్ పేషెంట్లుగా వచ్చేవాళ్లు చాలామంది 90 శాతానికి తక్కువ ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్‌తో వస్తున్నారు. వీరి ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు వెంటిలేటర్ అమర్చాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.. అంటున్నారు కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ వీవీ రమణ ప్రసాద్. ప్రస్తుత కరోనా పరిస్థితులు, మొదటి వేవ్‌కు భిన్నంగా సెకండ్ వేవ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఆరోగ్యం వేగంగా క్షీణించడానికి దారితీస్తున్న కారణాలు, జ్వరం కొనసాగుతున్నా కరోనా కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర అంశాలపై ‘సాక్షి’ఇంటర్వ్యూలో ఆయన వివరణ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... పెరిగిన ముప్పు సెకండ్ వేవ్‌లో మ్యుటేట్ అయిన వైరస్ తీవ్రత పెరగడంతో పాటు దాని వ్యాప్తి అధికం కావడం తోనే సమస్య జటిలమై ఎక్కువ చేటు చేస్తోంది. మొదటి దశతో పోల్చితే ప్రస్తుతం గుంపులు గుంపులుగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. గతంలో పెద్ద వయసు వారు, డయాబెటిక్, బీపీ, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారిపై వైరస్ అధిక ప్రభావం చూపింది. కానీ ఇప్పుడు 30–50 ఏళ్ల వయసులోని వారికి కూడా వైరస్ సోకడంతో పాటు దాని ప్రభావంతో ఆరోగ్యం కూడా వేగంగా దిగజారుతోంది. మొదటి దశలో లాగా చికిత్సకు ఎక్కువ టైం ఉండడం లేదు. దీనివల్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు, స్వల్పంగానే ఉంది తర్వాత చూద్దాంలే అనుకున్న వారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. ఐదో రోజు దాటితే క్లిష్టపరిస్థితులు ఐదో రోజు తర్వాత కూడా జ్వరం కొనసాగిన పక్షంలో రెండో వారం ప్రవేశించేకల్లా రోగుల ఆరోగ్య పరిస్థితి చాలా త్వరగా విషమిస్తోంది. సాధారణ జ్వరం లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు సోకితే మూడోరోజు కల్లా జ్వరం తగ్గిపోతుంది. మొదటి వారంలో ఎవరో ఒకరి సలహాతో సీటీ స్కాన్ చేయించుకుని న్యూమోనియా లేదు ఇంకా ఏ సమస్య లేదు అంతా బాగానే ఉంది అని ధైర్యంగా ఉన్నవాళ్లు, చిన్నజ్వరమే కదా అని తగ్గిపోతుంది అని తాత్సారం చేసే వాళ్ల పరిస్థితి తర్వాత ప్రమాదకరంగా మారుతోంది. వీరిలో ఆక్సిజన్ శాచురేషన్ చాలా వేగంగా పడిపోతోంది. కుటుంబంలో ఒకరికి వస్తే మొత్తం ఇంటి సభ్యులందరికీ సోకడం, కొందరికి సీరియస్‌గా మారడం సెకండ్ వేవ్‌లో వచ్చిన మార్పుగా గమనించొచ్చు. వ్యాక్సిన్ జ్వరంపై అపోహలు వ్యాక్సినేషన్ (అది మొద టిది లేదా రెండో డోస్ కావొచ్చు)తీసుకున్నాక, ఒకటి లేదా రెండురోజులు జ్వరం రావొచ్చు. ఒకవేళ వచ్చినా పారాసిటమాల్ మాత్ర సరిపోతుంది అని డాక్టర్లు, నర్సులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే 3, 4 రోజులు గడిచినా జ్వరం తగ్గకపోయినా, అది వ్యాక్సిన్ కారణంగా వచ్చినదే అని అపోహపడి, రెండో వారం దాకా నిర్లక్ష్యం చేయకూడదు. అలా నిర్లక్ష్యంతో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, న్యూమోనియా ఏర్పడి ఆలస్యంగా ఆసుపత్రులకు వస్తున్న కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఆక్సిజన్ పరిజ్ఞానం ఉండటం లేదు తక్కువ వయసులో ఉన్నవారు ఈసారి ఎక్కువగా వైరస్ బారిన పడి వేగంగా అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు, అంతగా చదువుకోని వారు చాలామందిలో పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ స్థాయిలు పరీక్షించుకునే పరిజ్ఞానం ఉండడం లేదు. దానిని ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా వాడాలి అన్న అవగాహన లేని వారు కూడా ఉన్నారు. ఒకవేళ పల్స్ ఆక్సీమీటర్ అందుబాటులో లేకపోయినా థర్మామీటర్‌తో రోజుకు నాలుగుసార్లు టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. కొత్తగా దగ్గు, ఆయాసం వచ్చినా లేదా జ్వరం తగ్గకపోయినా వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో పాటు బోర్లా పడుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకుంటే ఆక్సిజన్ స్థాయిలు పడిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అపోహలకు గురికావొద్దు మొదటి వారంలోనే సొంత వైద్యం లేదా ఇతరుల సలహాలతో ఇష్టం వచ్చిన మందులు, స్టెరాయిడ్స్ వంటివి వాడి చాలామంది అంతా బాగానే ఉందనే అపోహతో ఉంటున్నారు. మొదటి రోజు నుంచే వరసగా డోలో లేదా పారాసిటమల్ బిళ్లలు 3, 4 వేసుకుంటే టెంపరేచర్ తెలియదు కాబట్టి నియంత్రణలోకి వచ్చిందనే భావన కలుగుతోంది. ఇది ఆరు, ఏడో రోజు కొనసాగి ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోయి తీవ్రంగా జబ్బుపడుతున్న కేసులు కూడా పెరుగుతున్నాయి. గతంలో పేషెంట్లకు 10 –14 రోజుల్లో ఉత్పన్నమయ్యే సమస్యలు ఇప్పుడు ఐదు రోజుల తర్వాత తీవ్రమైన సమస్యలుగా మారుతున్నాయి. ఈ సమయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం, పాజిటివ్ వచ్చినా ఇంకా ముదరలేదు కదా అన్న ధీమా కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. నెగెటివ్ వచ్చినా.. జ్వరం ఉంటోంది. నెమ్మదిగా పెరుగుతుంది. తగ్గడం లేదు. దగ్గు,ఆయాసం వస్తున్నాయి. అయినా ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్‌టీపీసీర్‌లలో నెగెటివ్ రావడంతో కొందరు కోవిడ్ రాలేదని తమకు తామే భరోసా ఇచ్చుకుంటున్నారు. కొంతమంది టైఫాయిడ్, డెంగీ టెస్ట్‌లు చేయిస్తూ అందులో పాజిటివ్ వచ్చింది. ఆర్టీపీసీర్ నెగెటివ్ వచ్చింది కాబట్టి తమకు టైఫాయిడ్ లేదా డెంగీ వచ్చిందే తప్ప కరోనా కాదని అనుకుంటున్నారు. వాటికి మందులు వాడుతూ కోవిడ్‌ను నిర్లక్ష్యం చేయడం చేటు చేస్తోంది. సీటీస్కాన్ తప్పనిసరి ఐదోరోజు తర్వాతా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వచ్చిన వారిలో జ్వరం కొనసాగుతూ.. దగ్గు, ఆయాసం కూడా ఉంటే వారు తప్పనిసరిగా సీటీస్కాన్ చేయించుకోవాలి. స్కాన్‌లో తేడాలుంటే కోవిడ్‌గా భావిం చి చికిత్స తీసుకోవాలి. అప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు ఘోరంగా ఉంటాయి. అందుబాటులో ప్రత్యామ్నాయాలు గతంతో పోల్చితే చికిత్స పరంగా కొన్ని ప్రత్యా మ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా కొన్ని బయలాజికల్స్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్మాతో ఫలితాలొస్తున్నాయి. తక్కువ రేటుకే ఇతర ఇంజెక్షన్లు కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా మెరుగైన స్థితిలోనే ఉన్నా..పేషెం ట్లు జబ్బు ముదిరాక ఊపిరితిత్తులు పాడై ఆసుపత్రులకు వస్తుండడం పెద్ద సమస్యగా మారింది. అందువల్ల సెకండ్‌వేవ్ పరిస్థితులను అర్థం చేసుకుని జాగురూకతతో వ్యవహరిస్తేనే మంచిది. ఏ వయసు వారైనా అజాగ్రత్తతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దాని బారిన పడడం ఖాయమనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్, భౌతికదూరం, శానిటైజేషన్ వంటివి పాటించడంతో పాటు కచ్చితంగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. -
రోబోటిక్ సాయంతో మూర్చ రోగికి చికిత్స
సాక్షి, హైదరాబాద్: మూర్చ వ్యాధితో బాధపడుతున్న తొమ్మిదేళ్ల బాలుడికి రోబోటిక్ పరిజ్ఞానం సాయంతో విజయవంతంగా ఎలక్ట్రోడ్లను అమర్చారు కిమ్స్ వైద్యులు.. ఈ తరహా చికిత్స నగరంలోనే తొలిదని వారు ఆదివారం వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన బాలుడు గత ఐదేళ్లుగా మూర్చ సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. రోజుకు నాలుగైదు సార్లు వచ్చే మూర్చతో చాలా అవస్థలు పడేవాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని చికిత్స కోసం గత నెల 11న కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. న్యూరాలజిస్ట్ సీతాజయలక్ష్మి బాలుడికి ఎంఆర్ఐ, ఈఈజీ పరీక్షలు చేయించారు. సమస్య మూలాలు గుర్తించేందుకు డాక్టర్ మానస్ పాణిగ్రాహి నేతృత్వంలోని వైద్య బృందం రోబోటిక్ టెక్నాలజీ సాయంతో మెదడులో 8 ఎలక్ట్రోడ్లను విజయవంతంగా అమర్చారు. సాధారణంగా ఇలాంటి చికిత్సకు 7 నుంచి 8 గంటల సమయం పడుతుండగా, రోబోటిక్ టెక్నాలజీతో 3 గంటల వ్యవధిలోనే అవసరమైన చోట కావాల్సినన్ని ఫ్రేమ్‌లను పెట్టి ఎలక్ట్రోడ్లను అమర్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ తరహా చికిత్స వల్ల రోగికి తక్కువ నొప్పి, తక్కువ ఖర్చుతో పాటు త్వరగా కోలుకునే అవకాశముందని వెల్లడించారు. మూర్చకు కారణమైన మూలాలను గుర్తించి, ఆ మేరకు తదుపరి చికిత్సలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. -
జబ్బుకు అందని డబ్బు
నిబంధనల సాకుతో వైద్యానికి డబ్బు ఇవ్వని బ్యాంకు సిబ్బంది చికిత్సకు రూ.30 వేలు అవసరమన్నా రూ.10 వేలే ఇచ్చి పంపిన వైనం సాక్షి, మెదక్: పెద్ద నోట్ల రద్దు, మార్పిడి వ్యవహారం ఓ కిడ్నీ రోగి ప్రాణం మీదకు తెచ్చింది! బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా వైద్యం పొందలేని దయనీ య పరిస్థితి. డయాలసిస్‌కు అవసరమైనన్ని డబ్బు లు డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులు నిరా కరించడంతో ఆమె చికిత్సకు దూరమైంది. వైద్యా నికి డబ్బులు కావాలని బతిమాలుకున్నా బ్యాంకు సిబ్బంది కనికరించకపోవడంతో కన్నీళ్లతో వెనుది రిగింది. మెదక్‌లోని ఫతేనగర్‌కు చెందిన ప్రమీలకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 2015లో హైద రాబాద్లోని కిమ్స్ వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ఏడాదిన్నరగా కిమ్స్‌లో చికిత్స పొందుతోంది. వైద్యుల పర్యవేక్షణలో ఇంటి వద్దే వైద్యం చేయించుకోవచ్చు. అయితే ప్రతినెలా ఓసారి డయాలసిస్ పైప్ మార్చుకోవటంతోపాటు డయాలసిస్ కిట్లు కొనుగోలు చేయాలి. ఈ నెల 9న ప్రమీల డయాలసిస్ కోసం కిమ్స్‌కు వెళ్లాల్సి ఉంది. బ్యాంకుల బంద్ ఉండటంతో వెళ్లలేదు. గురువారం డబ్బులు డ్రా చేసుకుని కిమ్స్ వెళ్లాలనుకుంది. మెద క్ ఎస్బీహెచ్ బ్యాంకులోని తన ఖాతాలో రూ.35 వేల డబ్బులు ఉండటంతో రూ.30 వేలు డ్రా చేసు కుందామని భర్త ప్రేమ్‌కుమార్‌తో కలిసి స్థానిక రాంనగర్‌లోని ఎస్బీహెచ్ బ్యాంకుకు వెళ్లింది. అరుుతే బ్యాంకు సిబ్బంది కేవలం పది వేలు మాత్రమే డ్రా చేసుకునేందుకు అవకాశం ఉం దన్నారు. తన ఖాతాలో రూ.35 వేలు ఉన్నాయని, వైద్యం కోసం తనకు తక్షణం రూ.30 వేలు అవస రమని బ్యాంకు సిబ్బందిని వేడుకుంది. అయినా సిబ్బంది ససేమిరా అనటంతో అకౌంట్ నుంచి రూ.10 వేలు డ్రా చేసుకుంది. మరో రెండు రోజులు ఆగితేగానీ ప్రమీల రూ.20 వేలు డ్రా చేసుకోలేని పరిస్థితి. వైద్యానికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా?: ప్రేమ్‌కుమార్ ‘‘నా భార్య ప్రమీలకు ప్రతినెలా డయాలసిస్ కిట్లు కొనుగోలు చేయటంతోపాటు పైప్ మార్చుకోవాలి. డయాలసిస్ కిట్లకు రూ.20,070, ఇంజెక్షన్‌కు రూ.5 వేలు, రవాణా చార్జీలు మరో రూ.3 వేలు అవుతుంది. మొత్తంగా రూ.30 వేల వరకు అసవరం. బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు డ్రా చేసుకోనివ్వటంలేదు. దీంతో డయాలసిస్‌ను వారుుదా వేసుకోవాల్సి వచ్చింది’’ నా వద్దకు రాలేదు: శ్రీనివాస్, బ్యాంకు మేనేజర్ వైద్యం కోసం డబ్బులు అవసరమని ప్రమీల తనను సంప్రదించలేదని ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకు అకౌంట్లో నుంచి ఒకరోజు రూ.10 వేలు మాత్రమే డ్రా చేయాలన్న నిబంధన ఉంది. అయితే వైద్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి ఉంటే ఆ పత్రాలు చూపిస్తే తప్పకుండా సాయం చేసే వాళ్లమని చెప్పారు. -
కిమ్స్‌లో సెరిబ్రల్‌పాల్సీ బాధితునికి శస్త్రచికిత్స
ఈ తరహా శస్త్రచికిత్స దేశంలోనే మొట్టమొదటిదని వైద్యుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ (శరీర కదలికలను నియంత్రించే శక్తిని మెదడు కోల్పోవడం)తో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్సతో కృత్రిమ తుంటిని విజయవంతంగా అమర్చారు. ఈ తరహా చికిత్సను అందించడం దేశంలోనే ఇది తొలిసారని వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కిమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు వెల్లడించారు. వరంగల్ జిల్లా తొర్రూర్‌కు చెందిన శ్రీశైలం(40) పుట్టుకతోనే సెరిబ్రల్‌పాల్సీతో బాధపడుతున్నాడు. మూడేళ్ల క్రితం ప్రమాదశాత్తూ జారీ కిందపడిపోవడంతో తుంటి ఎముక విరిగి కాళ్లు, చేతులు చచ్చు బడి పోయాయి. వైద్య పరిభాషలో దీన్ని (క్వాడ్రీపారిసిస్)గా పిలుస్తారు. దీంతో గత మూడేళ్ల నుంచి ఆయన పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. ఏడాది క్రితం కిమ్స్‌లోని ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఉదయ్‌కృష్ణను కలిశాడు. పరీక్షించి, పలు వైద్య పరీక్షలు చేయించారు. బాధితుని తుంటికి సరితూగే కృత్రిమ బాల్‌ను విదేశాల్లో తయారు చేయించారు. ఇటీవలే ఆయనకు మెటికులస్ ప్లానింగ్ ద్వారా శస్త్రచికిత్స చేసి దెబ్బతిన్న తుంటి భాగంలో కృత్రిమ తుంటిని అమర్చారు. చికిత్స చేసిన పది రోజులకే ఆయనస్వయంగా లేచి నిలబడుతున్నాడని, మరో మూడు నెలల్లో ఆయన స్వయంగా లేచి నిలబడటంతో పాటు ఎవరి సహాయం అవసరం లేకుండానే నడ వగలడని వైద్యులు స్పష్టం చేశారు. చికిత్సకు రూ. 6 లక్షలు ఖర్చు అవుతుండగా, రోగి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తాము కేవలం రూ.2 లక్షలకే ఈ శస్త్రచికిత్స చేసిన ట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గోపి పాల్గొన్నారు.