రోబోటిక్ పరిజ్ఞానంతో మూర్చ రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: మూర్చ వ్యాధితో బాధపడుతున్న తొమ్మిదేళ్ల బాలుడికి రోబోటిక్ పరిజ్ఞానం సాయంతో విజయవంతంగా ఎలక్ట్రోడ్‌లను అమర్చారు కిమ్స్ వైద్యులు.. ఈ తరహా చికిత్స నగరంలోనే తొలిదని వారు ఆదివారం వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన బాలుడు గత ఐదేళ్లుగా మూర్చ సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. రోజుకు నాలుగైదు సార్లు వచ్చే మూర్చతో చాలా అవస్థలు పడేవాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని చికిత్స కోసం గత నెల 11న కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. న్యూరాలజిస్ట్ సీతాజయలక్ష్మి బాలుడికి ఎంఆర్‌ఐ, ఈఈజీ పరీక్షలు చేయించారు.
సమస్య మూలాలు గుర్తించేందుకు డాక్టర్ మానస్ పాణిగ్రాహి నేతృత్వంలోని వైద్య బృందం రోబోటిక్ టెక్నాలజీ సాయంతో మెదడులో 8 ఎలక్ట్రోడ్‌లను విజయవంతంగా అమర్చారు. సాధారణంగా ఇలాంటి చికిత్సకు 7 నుంచి 8 గంటల సమయం పడుతుండగా, రోబోటిక్ టెక్నాలజీతో 3 గంటల వ్యవధిలోనే అవసరమైన చోట కావాల్సినన్ని ఫ్రేమ్‌లను పెట్టి ఎలక్ట్రోడ్‌లను అమర్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ తరహా చికిత్స వల్ల రోగికి తక్కువ నొప్పి, తక్కువ ఖర్చుతో పాటు త్వరగా కోలుకునే అవకాశముందని వెల్లడించారు. మూర్చకు కారణమైన మూలాలను గుర్తించి, ఆ మేరకు తదుపరి చికిత్సలు అందించనున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment