రెండేళ్లలో కేసీఆర్ చేసిందేమిటి?: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కోటి ఆశలతో, అనేకమంది త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ధర్నాలు ఆగాయా.. ముళ్ల కంచె బాధలు తప్పాయా? అని బీజేపీ శాసనసభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ నేతలు ప్రకాశ్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్, దాసరి మల్లేశంలతో కలసి బుధవారం ఆయన పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
విపక్షపార్టీలే ఉండకూడదనే దుర్మార్గ రాజకీయాలతో సీఎం కేసీఆర్ భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులు, గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ రెండేళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని బహిరంగంగా ప్రకటించిన అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.