‘సింగరేణి’ హామీలను విస్మరించింది: బీజేపీ
20 నుంచి 23 తేదీల్లో కిషన్‌రెడ్డి బొగ్గుబావుల పర్యటన
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల పరిధిలోని ఆయా జిల్లాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్య సింగరేణి జిల్లాల్లో బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి బొగ్గుబావుల పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడ పార్టీ నాయకులు ఎస్.కుమార్, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ఎన్‌వీ ప్రకాశ్, సుధాకర శర్మలతో కలసి ‘కిషన్‌రెడ్డి బొగ్గుబావుల పర్యటన’ పోస్టర్‌ను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నుంచి ఆసిఫాబాద్ వరకు ఈ యాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్మికులకు వైద్య సదుపాయాల లేమి, ఆస్పత్రుల్లో వైద్యుల కొరత, ఇళ్లస్థలాల సమస్యలపై నిలదీస్తామన్నారు. సింగరేణి ప్రాంత రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, గోదావరి ప్రవహిస్తున్నా అక్కడి భూములకు నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సింగరేణి సమస్యలను తెలుసుకొని వాటిపై కేంద్రానికి నివేదికను కూడా సమర్పిస్తామని చెప్పారు. సింగరేణిలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య 56 వేలకు కుంచించుకుపోయినా సీఎం కేసీఆర్ స్పందన కరువైందన్నారు.