
'కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
హైదరాబాద్ : తమ అవినీతి సొమ్ము, నల్లధనం బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలన వల్లే దేశంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డి మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ... అవినీతిని రూపుమాపేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని అన్నారు. అందుకే రూ.500, 1000 నోట్లను రద్దు చేశారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కేసీఆర్ పాలనా వైఫల్యమే కారణమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో 30 ఏళ్లు వెనక్కి పోతామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది వాస్తవం కాదా? అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.