నిజాలు తెలుసుకుని మాట్లాడాలి
మంత్రి దేవినేనిపై పీఏసీ చైర్మన్ బుగ్గన ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఏపీ సాగునీటి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇష్టానుసారం మాట్లాడటం ఎంత మాత్రం సరికాదని పీఏసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తానేదో ప్రభుత్వ భూమిని ఆక్రమించి గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) కాలువ తవ్వకుండా అడ్డుపడుతున్నట్లు మంత్రి చెప్పడం వాస్తవ విరుద్ధమన్నారు. కాలువ తవ్వకానికి ప్రతిపాదించిన భూమిలో తనతో పాటు పలువురు రైతులు (యజమానులు)కూడా ఉన్నారని ఆయన వివరించారు. 2010లో కాలువ తవ్వకానికి పెగ్‌మార్క్ చేసినపుడే జిల్లా కలెక్టర్‌కు, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్, జీఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ కలెక్టర్‌కు అది తమ పట్టా భూమి అని వివరిస్తూ లేఖలు రాసిన సంగతి దేవినేని తెలుసుకోవాలన్నారు. కోర్టులో ఉన్న ఈ వ్యవహారంపై మాట్లాడ టం సరికాదన్నారు.
మంత్రికి తెలియదా?
మంత్రి చెబుతున్న భూమికి 1929లోనే టైటిల్ డీడ్ ఉందని బుగ్గన చెప్పారు. తాను, తన పూర్వీకులు ఆ భూమిని ఆక్రమించినట్లు భావిస్తే నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలన్నీ చూస్తూ ఊరకున్నాయని మంత్రి అనుకుంటున్నారా? 1954కు ముందు అసైన్ అయిన భూములపై సర్వహక్కులు వారికే ఉంటాయన్న విషయం కూడా తెలియదా? అని ప్రశ్నించారు.
మీ పరిపాలనపై విచారణకు సిద్ధమా?
దేవినేని సాగునీటి మంత్రి అయ్యాక ఏఏ టెండర్లు పిలిచారో.. ఏఏ పనులు జరిగాయో సమగ్ర విచారణకు సిద్ధమేనా? అని బుగ్గన సవాలు విసిరారు. అవుకు టన్నెల్ వ్యయాన్ని రూ.44 కోట్లు పెంచారని సాక్షాత్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పిన మాట నిజమా.. కాదా? అని ప్రశ్నించారు. పట్టిసీమ మొదలు ప్రతి ప్రాజెక్టులోనూ ఏదో ఒక లొసుగు, అవినీతి దాగి ఉందన్నారు.