కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్: బాల్క
సాక్షి, హైదరాబాద్: కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ అని రుజువైందని, గత జూలై 16, 27 తేదీల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన కలిశారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, సుశీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందిన అమరేందర్ రెడ్డిలతోపాటు కోదండరాం.. సోనియాను కలిశారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ‘కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ అని మొదట్నుంచీ మేం చెబుతూ వస్తున్నాం. ఇప్పుడు అదే రుజువైంది. సోనియాను కలసిన తర్వాతనే మల్లన్న సాగర్ ఆందోళనల్లో కోదండరాం పాల్గొన్నారు. ప్రతి వేదిక మీద ప్రభుత్వాన్ని విమర్శించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ ద్రోహి’అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ శిఖండి రాజకీయాలు మానుకుంటే మంచిదని, దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలని సవాలు చేశారు. కోదండరాం జేఏసీ, మేధావి ముసుగులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటే మంచిదని హితవు పలికారు. ఢిల్లీలోనే కాదు హైదరాబాద్‌లోనూ పీసీసీ చీఫ్ ఉత్తమ్, కోమటిరెడ్డి, జైపాల్‌రెడ్డిలను ఆయన కలుస్తున్నారని ఆరోపించారు. తనకు పదవులు, అధికారం మీద వ్యామోహం లేదంటున్న కోదండరాం.. కాంగ్రెస్ కపట నాటకంలో మాత్రం సూత్రధారిగా మారారని విమర్శించారు.
రాష్ట్రంలో చచ్చిపోయిన కాంగ్రెస్‌ను బతికించేందుకు ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు. కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్‌లకు కోదండరాం కాంగ్రెస్ టికెట్ ఇప్పించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో ఆయనది శిఖండి పాత్ర అని దుయ్యబట్టారు.