ఎత్తిపోతలు సీమాంధ్ర కాంట్రాక్టర్ల కోసమా?
- జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం
- రైతు సమస్యలపై త్వరలో పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదులపై చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టులు ప్రజల కోసమా, సీమాంధ్ర కాంట్రాక్టర్లకోసమా? అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ జేఏసీ రాష్ట్ర బాధ్యులు, జిల్లాల ఇన్‌చార్జ్‌లకు ఆదివారం హైదరాబాద్‌లో ఒకరోజు అధ్యయన తరగతులను నిర్వహించారు. తరగతుల ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో కోదండరాం మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ఆచరణకు విరుద్ధంగా ఉందన్నారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, రైతు సమస్యల పరిష్కారంకోసం జిల్లాల్లో త్వరలోనే పాదయాత్ర చేస్తామని కోదండరాం ప్రకటించారు. కాగా, సాగునీటిరంగంలో ఖర్చు తగ్గించేవిధంగా ప్రత్యామ్నాయమార్గాలున్నా ప్రభుత్వం సీమాంధ్ర కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి భారీ ఎత్తిపోతలను చేపడుతున్నదని ఆయన ఆరోపించారు.
మల్లన్నసాగర్ నిర్మాణానికి ప్రభుత్వం ఎంచుకున్న ప్రదేశం భారీ రిజర్వాయరు నిర్మాణానికి అనుకూలంకాదన్నారు. దీర్ఘకాలిక విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో ప్రభుత్వం విపరీతమైన దుబారాఖర్చు చేస్తోందని అన్నారు. ధర్నా చౌక్ పరిరక్షణకోసం మే 15న చలో ఇందిరాపార్క్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధ్యయన తరగతుల్లో టీజేఏసీ ముఖ్యనేతలు పి.రఘు, గురజాల రవీందర్‌రావు, ఇటిక్యాల పురుషోత్తం, గోపాలశర్మ, కన్నెగంటి రవి, వెంకటరెడ్డి, భైరి రమేశ్, డి.పి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.