కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలో చెబుతారా?
ఆ పార్టీ నేతలకు చీఫ్‌విప్ కొప్పుల ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లేయాలో తాము లక్ష కారణాలు చెబుతామని, కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లేయాలో ఆ పార్టీ నాయకులు ఒక్క కారణమైనా చెప్పగల రా అని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో నిలదీశారు. అరవై ఏళ్లు సాగునీరు ఇవ్వకుండా పాలేరు నియోజకవర్గాన్ని ఎండబెట్టిన దుర్మార్గచరిత్ర టీడీపీ, కాంగ్రెస్‌లదేనని విమర్శించారు. తెలంగాణ ద్రోహుల కూటమి పాలేరులో మునగక తప్పదని హెచ్చరించారు.
పాలేరులో టీఆర్‌ఎస్ గెలవక పోతే తన పదవికి రాజీనామా చేస్తానన్న మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను కాంగ్రెస్ నేతలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. నాడు తెలంగాణ రాకుండా అడ్డుపడిన ద్రోహులే రాష్ట్రం వచ్చాక అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇప్పటికే నామరూపాల్లేకుండా పోయిన టీడీపీకి పట్టిన గతే రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కూ పడుతుందన్నారు.