
కర్ణాటకలో కృష్ణమ్మ పరవళ్లు
- 4 రోజుల్లో ఆలమట్టి, తుంగభద్రలోకి 30 టీఎంసీల నీరు
- ఆలమట్టికి 1.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో ఇలాగే ఉంటే ఆగస్టు కల్లా శ్రీశైలం, జూరాలకు నీరు
సాక్షి, హైదరాబాద్/జూరాల : కృష్ణా నది ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ప్రాజెక్టులకు భారీగా నీరు చేరుతోంది. గడిచిన నాలుగు రోజుల్లోనే అక్కడి ప్రధాన ప్రాజెక్టులైన ఆలమట్టి, తుంగభద్రల్లోకి 30 టీఎంసీల మేర నీరు వచ్చింది. బుధవారం సైతం ఆలమట్టికి 1.27 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఒకట్రెండు రోజుల్లో మరో 20 టీఎంసీల నీరు చేరే అవకాశ ం ఉంది. ఎగువ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో చేరితే దిగువకు క్రమంగా ప్రవాహాలు మొదలుకానున్నాయి. ఎగువన ప్రస్తుతం మాదిరే ప్రవాహాలు కొనసాగితే ఆగస్టు రెండు లేక మూడో వారానికి శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లోలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎగువన ఇదీ పరిస్థితి..
ఆలమట్టి నిల్వ సామర్థ్యం 129.7 టీంసీలు. ఈ ప్రాజెక్టులోకి నాలుగు రోజుల క్రితం వరకు కొత్తగా 19 టీఎంసీల నీరు చేరింది. బుధవారం నాటికి అది 39.7 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 54.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో ఆలమట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.50 టీఎంసీల నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు నిండితే కృష్ణమ్మ తెలంగాణ వైపు వైపు పరుగులు తీసే అవకాశం ఉంది. కర్ణాటకలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.86 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 11,756 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా తాగునీటి అవసరాలకు 756 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జూరాలకు వస్తోంది తక్కువే..
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.57 టీఎంసీల నిల్వ ఉంది. జూరాలకు ఇన్‌ఫ్లో కేవలం 35 క్యూసెక్కులు మాత్రమే ఉండగా.. అదేస్థాయిలో ఎడమ కాల్వ ద్వారా తాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌కు 28 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 590 అడుగులకు గానూ 504 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలోనూ 885 అడుగులకుగానూ నీటినిల్వ 788.4 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో లభ్యతగా ఉన్న 23.72 టీఎంసీలపైనే రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి.