ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా మైనింగ్ మాఫియా, అక్రమార్కుల ఆగడాలను నిరోధిస్తామని పరిశ్రమలు, మైనింగ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను కేటాయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. పేద ప్రజలకు సౌకర్యం ఉండేలా.. సామాన్యుడి సొంత ఇంటి కలకు సహకారం అందించేలా.. రాష్ట్ర నూతన మైనింగ్ పాలసీ ఉంటుందన్నారు. గనులు, భూగర్భ వనరుల శాఖకు సంబంధించిన అంశాలపై శుక్రవారం మంత్రి కేటీఆర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా రవాణా చేసే లారీలను సీజ్ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి.. ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా జిల్లాల్లోని ఇంజనీరింగ్ విభాగం సిబ్బందితో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లా స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్: ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు మొబైల్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ బృందాలన్నింటినీ పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్’ ఏర్పాటు చేయాలన్నారు. ఓవర్ లోడింగ్ సమస్యను అరికట్టేందుకు వేబ్రిడ్జిల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మైనింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఎండీసీ ఎండీ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.