
ఐదేళ్లలో రూపురేఖలు మార్చేస్తాం
* నగరంలో కేటీఆర్ రోడ్‌షో
* రాయదుర్గం నుంచి ప్రారంభం
రాయదుర్గం: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో నగర రూపురేఖలు మార్చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నగరంలో ఆరు రోజులపాటు నిర్వహించే రోడ్‌షో కార్యక్రమాన్ని శనివారం గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం నుంచి ప్రారంభించారు. అనంతరం శేరిలింగంపలి గుల్‌మొహర్‌పార్క్ కాలనీ, తారానగర్ మెయిన్‌రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా మజిస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు గ్రేటర్ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు, వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలో వస్తే సీమాంధ్రులపై దాడులు జరుగుతాయని భయపెట్టారని, అయితే తమ హయాంలో ఒక్క ఘటన కూడా జరగలేదన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 25 వేల కోట్లు కేటాయించామన్నారు. గత ఆరునెలల్లో నగరానికి రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు రాగా, 70 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నామని, ఈ ఏడాది 10 వేలు, వచ్చే ఏడాది 20 వేల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రూ. 4,500 కోట్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మీ, ఆరు కిలోల బియ్యం, ఆటో డ్రైవర్లకు బీమా తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘన త ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. విదేశాలకు వెళ్తున్న ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హైదరాబాద్ ముఖం చూడలేదని, బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారన్నారు.
గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, దీంతో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రు లు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండావిశ్వేశ్వరరెడ్డి, జితేందర్‌రెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డి, పార్టీ అభ్యర్థులు కొమిరిశెట్టి సాయిబాబా, హమీద్‌పటేల్, రాగం నాగేందర్‌యాదవ్, నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, బండిరమేష్, శంకర్‌గౌడ్, నర్సింగ్‌రావులు పాల్గొన్నారు.
సీఎం డిజిటల్ ప్రసంగం
నగరంలో ఆరు రోజుల పాటు నిర్వహించే రోడ్ షోను రాయదుర్గంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించాల్సి ఉం ది. అయితే మూడు గంటలు ఆలస్యం గా సాయంత్రం 6 గంటలకు మంత్రి రావడంతో ప్రజలు, నాయకులు నిరసించిపోయారు. కాగా మంత్రి వచ్చే వరకు డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినిపించారు.