
ప్రజల జీవితంతో కేసీఆర్ చెలగాటం: రమణ
జిల్లాలు, మండలాల విభజన పేరిట కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీటీడీపీ అధ్యక్షుడు
హైదరాబాద్: జిల్లాలు, మండలాల విభజన పేరిట కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ఆడుతున్న కపట నాటకం ఇదన్నారు. నల్లగొండ జిల్లా గట్టుప్పలను మండలంగా ప్రకటించాలంటూ ఆత్మహత్యాయత్నం చేసి, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏర్పుల యాదయ్యను ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
నూతన జిల్లాలు, మండలాల విభజన సహేతుకంగా లేదని.. టీడీపీ ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలోనూ స్పష్టం చేసిందని రమణ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకుల్లో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే జిల్లాలు, మండలాల విభజనలో సామాన్య ప్రజలు బలిపశువులు అవుతున్నారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.