మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో నాటిన మొక్కల్ని సంరక్షించేందుకుగాను ఉపాధి హామీ కూలీలను వినియోగిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున పంచాయతీరాజ్ రోడ్లకు ఇరుపక్కల ఒకే రోజు 10 వేల మొక్కలు నాటాలని తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారంలో నాటిన ప్రతీ మొక్కను రక్షించేందుకు ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందన్నారు.
ప్రైవేటు స్థలాల్లో నాటిన టేకు మొక్కలకు ఒక్కోదానికి నెలకు రూ. 1, పండ్ల మొక్కలైతే రూ.15, ఇతర ఒక్కో మొక్కకు రూ. 1 చెల్లిస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థల్లో నాటిన ఒక్కో మొక్కకు నెలకు రూ. 11.20 పైసలు చెల్లిస్తామన్నారు. రోడ్ల పక్కన నాటిన ఒక్కో మొక్కకు రూ. 12, ఈత చెట్లకు ఒక్కో దానికి రూ. 5, చెరువు గట్లు, ప్రభుత్వ భూముల్లో నాటిని ఈత చెట్లయితే ఒక్కో దానికి రూ. 11.20పైసలు చెల్లించనున్నట్లు వివరించారు.