ఉపాధి కూలీలు సోమరిపోతులా?
► ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అనుచిత వ్యాఖ్యలపై మండిపాటు రాస్తారోకో, ధర్నా,
► దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే క్షమాపణ
► చెప్పాలని డిమాండ్
దేవరాపల్లి: గ్రామీణ పేదలు సోమరిపోతులు అంటూ ఉపాధి కూలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజే పీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీరుపై వ్యవసాయ కార్మిక సంఘం మండిపడింది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మండల కేంద్రం దేవరాపల్లిలో బుధవారం ధర్నాతో పాటు రాస్తా రోకో నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో విష్ణుకుమార్‌రాజు దిష్టిబొమ్మ దహనం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.రాజు మాట్లాడుతూ గ్రామీణ పేదలు, ఉపాధి కూలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఉపాధి చట్టం వల్ల సోమరిపోతులుగా మారుతున్నారని.. అనేక పనులకు ఆటంకం కల్గుతోందని.. సంక్షేమ పథకాలు, కిలో రూపాయి బియ్యం సరఫరా చేయడం వల్ల బద్ధకస్తులుగా మారి.. పనికిమాలిన వారుగా తయారవుతున్నారని అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నారు. విశాఖ జిల్లాలో సుమారు 1.50 లక్షలు కుటుంబాలు ఉపాధి పనులు చేసుకుంటున్నారని తెలిపారు.
పేదల కష్టంపై జాలి, దయా లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ఉపాధి చట్టం నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడంతో పేదలపై బీజే పీకి ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోందన్నారు. ఈ నిరసనలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కర్రి సన్యాశినాయుడు, కె.బుచ్చిబాబు, ఈగల నాయుడు, ఈ.రవి, ఎస్.భారతి తదితరులు పాల్గొన్నారు.