రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్ సిటీ): వివిధ కారణాలతో ఇద్దరు మహిళలు హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి కథనం ప్రకారం... ఉప్పుగూడ అరుంధతి కాలనీకి చెందిన యువతి (23) ఎంబీఏ చదువుతోంది. తండ్రి వదిలి వేయడంతో తల్లితో కలిసి తాత ఇంట్లో ఉంటోంది. కాగా, కొద్ది రోజులుగా ఆమె నడుం నొప్పితో బాధపడుతోంది. బోన్ క్యాన్సర్ కావచ్చనే అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న ఆ యువతి గురువారం ట్యాంక్‌బండ్‌కు వచ్చి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు అడ్డుకున్నారు.
మరో ఘటనలో...రాజేంద్రనగర్ అత్తాపూర్‌కు చెందిన సీహెచ్ శివరాణి(50) ప్రైవేటు ఆస్పత్రిలో అటెండర్. ఈమె భర్త జీహెచ్‌ఎంసీలో పనిచేస్తూ 15 ఏళ్ల క్రితం మరణించగా పెద్ద కుమారుడికి అతని ఉద్యోగం ఇచ్చారు. చిన్న కుమారుడు ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. పెద్ద కుమారుడు తనను పట్టించుకోకపోవడంతో శివరాణి చిన్న కుమారుడి దగ్గర ఉంటోంది. అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీనికి తోడు చిన్నకోడలితో ఆమె చిన్నచిన్న విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురవుతున్న శివరాణి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇద్దరు మహిళలను రక్షించిన లేక్ పోలీసులు...
Published Thu, Apr 30 2015 10:27 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement