Lake police
-
పడవతో గస్తీ..లేక్ పోలీసింగ్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల 17 ఏళ్ల ఓ ఇంటర్ విద్యార్థి కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో దుర్గం చెరువులో పడవతో పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేశారు. కేబుల్ బ్రిడ్జి కింద వాచ్ టవర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలపై దృష్టి.. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఇంటికే పరిమితమైన పర్యాటకులు క్రమంగా బయటకు వస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే బదులు స్థానికంగా ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై సందర్శకుల తాకిడి పెరిగింది. వారాంతాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో మద్యం తాగడం, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి పోలీసుల దృష్టికి వచ్చాయి. దీంతో సందర్శకులకు భద్రతతో పాటూ అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా ఉండేందుకు పోలీసుల గస్తీని ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బ్రిడ్జిపై వాచ్ టవర్.. ఇప్పటికే దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో సైబరాబాద్ పోలీసులు 67 కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా బ్రిడ్జి కింద పోలీసు వాచ్‌టవర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అన్ని సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏ మూలన ఏ సంఘటన కెమెరాల్లో నిక్షిప్తమవుతుంది. అనుమానిత వ్యక్తులు సంచరించినా, ట్రాఫిక్‌జాం, ఇతరత్రా ఇబ్బందులు జరిగినా వెంటనే వాచ్ టవర్లోని పోలీసులకు తెలిసిపోతుంది. వెంటనే క్షేత్ర స్థాయిలోని పోలీసులకు సమాచారం అందించి, ఘటన స్థలానికి వెళ్లి తగిన చర్యలు చేపడతారు. వాచ్ టవర్‌లో పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారు. లేక్ పోలీసులకు ఈవీ వాహనాలు.. దుర్గం చెరువు పరిసరాలలో ఆర్టిఫీషియల్ వాటర్ ఫాల్స్, రాక్ గార్డెన్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, వాకింగ్ ట్రాక్‌ల వంటివి ఉన్నాయి. దీంతో పిల్లలు, యువకులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి రోడ్డు మధ్యలో నిలబడి సెల్ఫీలు తీసుకోవటం, వాహనాలకు అంతరాయం కలిగిస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించేందుకు లేక్ పోలీసులు 24 గంటలు గస్తీ చేస్తుంటారు. ఎలక్ట్రిక్ వాహనాలతో లేక్ పోలీసులు పెట్రోలింగ్ విధులను నిర్వహిస్తుంటారు. ఆయా ప్రాంతాలలో మహిళలతో అసభ్యంకరంగా ప్రవర్తించే పోకిరీలను షీ టీమ్ పోలీసులు అక్కడిక్కడే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పలుమార్లు ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తే జైలుకు పంపిస్తున్నారు. (చదవండి: నైట్ బజార్.. ఫుల్ హుషార్.) -
ట్యాంక్‌బండ్‌పై కలకలం: ఒకే రోజు ఐదుగురు మహిళలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ సందర్శకులను ఆకర్షిస్తుండగా ఇప్పుడు బలవన్మరణాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా ఒకేరోజు ఐదుగురు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న లేక్ పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. భర్త వేధింపులు తాళలేక డిప్రెషన్‌తో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. మరో మహిళ ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి ప్రయత్నించగా, ప్రేమ విఫలమైందని ఓ యువతి సాగర్‌లో దూకేందుకు ప్రయత్నించింది. ఇక మద్యానికి బానిసైన ఓ మహిళ కుటుంబ సమస్యలతో కూడా బాధపడుతుండడంతో హుస్సేన్‌సాగర్‌లో దూకింది. ఆత్మహత్యలు నివారించేందుకు అక్కడే గస్తీ కాస్తున్న లేక్ పోలీసులు వారిని వెంటనే కాపాడారు. గజ ఈతగాళ్ల సాయంతో సాగర్‌లో వారిని గాలించి బయటకు తీసుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని లేక్ పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒకే రోజు ఐదుగురు మహిళలు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం హైదరాబాద్‌లో కలకలం రేపింది. -
గొడవపడి మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే..
భువనేశ్వర్/ కటక్: కటక్ ప్రాంతంలోని జోబ్రా తీరంలో మహానదిలో శుక్ర వారం దంపతులు దూకేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక దళం సంఘటనా స్థలానికి వచ్చి నదిలో గాలించి ఆ దంపతులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చి స్థానిక ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. తొలుత నదిలో దూకిన భార్య స్వల్పంగా గాయపడింది. భార్యను కాపాడేందుకు భర్త వెంటనే మహానదిలో దూకినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనకు ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దంపతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది. చదవండి: ఘోరం.. కారులోనే ముగ్గురు సజీవదహనం చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్ -
ధనలక్ష్మి అంటే ఓ ధైర్యం.. ఆత్మవిశ్వాసం
రాంగోపాల్‌పేట్: మానసికంగా ఇబ్బంది పడుతూ.. ఆత్మహత్య చేసుకోవాలనిపించే వారికి లేక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బీ ధనలక్ష్మి ధైర్యం చెబుతూ వారికి అండగా నిలుస్తున్నారు. నెక్లెస్‌రోడ్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల రక్షణ, హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకునే వారిని రక్షించేందుకు 2003 లో లేక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్‌కు ఇన్స్పెక్టర్గా వచ్చిన ధనలక్ష్మి తన 16 నెలల కాలంలో 417 మంది ప్రాణాలు కాపాడారు. 24గంటలు లేక్ చుట్టూ సిబ్బందితో పహారా కాస్తూ నిరంతరం వారిని అప్రమత్తం చేస్తూ ఎవ్వరూ హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకోవద్దనే బలమైన ఆశయంతో పనిచేస్తూ, చేయిస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్లు, వృద్ధాప్యంతో ఒంటరితనం భరించలేని వాళ్లు కొందరు ఒక్కొక్కరిది ఒక్కో గాథ అలాంటి వారి బాధలన్నీ పూర్తిగా వినడం సమస్యల్లో నుంచి బయటపడే పరిష్కార మార్గాలు వెదికి చూపించడం చేస్తున్నారు ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి. మళ్లీ, మళ్లీ చావాలనే బలమైన కోరికతో ఉండే వారిని భరోసా కేంద్రానికి, రోష్నీ కౌన్సిలింగ్ కేంద్రాలకు పంపించి వారి మానసిక పరివర్తనలో పూర్తి మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. కర్తవ్య నిర్వహణతో పాటు ఉద్యోగాల కోసం, వారి ఉపాధి కోసం తన వంతు సాయం చేస్తున్నారు. -
ఇద్దరు చిన్నారులతో సహా హుస్సేన్‌సాగర్‌లో..
రాంగోపాల్‌పేట్: భర్త వేదింపులు భరించ లేక ఇద్దరు చిన్నారులతో కలిసి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నించిన ఓ మహిళను లేక్ పోలీసులు రక్షించారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి కథనం ప్రకారం ఓల్డ్‌బోయిన్‌పల్లి దుబాయ్గేట్కు చెందిన గద్దె బాలజీ, దివ్య (29)లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 8ఏళ్ల బాబు, 5ఏళ్ల పాప ఉన్నారు. బాలాజీ విలాసాలకు అలవాటుపడి ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. విలాసాల కోసం దివ్యకు చెందిన ఆస్తులు అమ్మేశాడు. ఇటీవల తాను వ్యాపారం చేస్తానని డబ్బు కావాలని భార్యను డిమాండ్ చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. మరో ఘటనలో భర్త మందలించాడనే మనోవేధనతో మరో మహిళ హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నించగా పోలీసులు రక్షించారు. మెదక్ జిల్లా మందారం గ్రామానికి చెందిన ప్రియాంకను నగరానికి చెందిన సుదర్శన్‌తో 2015 సంవత్సరంలో వివాహం జరిపించారు. అప్పటి నుంచి వారి జీవితం సాఫీగా సాగుతుంది. ఆదివారం రాత్రి అత్తతో చిన్న విషయంలో గొడవ జరిగింది. దీంతో భర్త భార్యను మందలించాడు. తీవ్ర మానసిక వేధనకు గురైన ఆమె హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ముగ్గురు పిల్లలతో సహా సాగర్ లో దూకిన మహిళ
హైదరాబాద్: తన ముగ్గురు పిల్లలు సహా ఓ తల్లి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజ్‌గిరికి చెందిన అవినాష్, జసంత ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంతానం ముగ్గురు కాగా, అందరూ ఆడపిల్లలే పుట్టారన్న సాకుతో భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదని ముగ్గురు పిల్లలతో సహా జసంత సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, లేక్ పోలీసులు వారిని కాపాడారు. ఇదే విషయంపై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
పోలీసుల అదుపులో 250 మంది బైక్ రేసర్లు
నెక్లెస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున బైక్ రేసింగ్‌లకు పాల్పడిన 250 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కావడంతో పోటాపోటీగా విపరీతమైన వేగంతో బైక్‌లు నడుపుతుండడంతో రామ్‌గోపాల్‌పేట, లేక్ పోలీసులు సంయుక్తంగా డ్రైవ్ నిర్వహించారు. సైఫాబాద్ ఏసీపీ సురేందర్, అడిషినల్ ఇన్స్పెక్టర్ జానయ్య, లేక్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, 50 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి... నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్, లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ ఈ కార్యక్రమం జరిగింది. అదుపులో తీసుకున్న 250 మందిలో 100 మంది మైనర్లు ఉన్నారు. వీరికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. -
భర్త తిట్టాడని.. సాగర్‌లో దూకేందుకు యత్నం!
రాంగోపాల్‌పేట్: భర్త తిట్టాడని హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నించిన ఓ మహిళను లేక్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంబర్‌పేట్‌కు చెందిన శుభకర్, కుంట భాగ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ విషయంలో ఇటీవల ఆవేశంలో భర్త ఆమెను దూషించాడు. దీంతో ఆమె తీవ్ర మనోవేధనకు గురై చనిపోవాలని నిశ్చయించుకుని ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తున్న ఆమెను గుర్తించిన లేక్ పోలీసులు రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ కోసం అంబర్పేట్ పోలీస్‌స్టేషన్‌కు భర్తతో పాటు పంపించారు. -
ఇద్దరు మహిళలను రక్షించిన లేక్ పోలీసులు...
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్ సిటీ): వివిధ కారణాలతో ఇద్దరు మహిళలు హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి కథనం ప్రకారం... ఉప్పుగూడ అరుంధతి కాలనీకి చెందిన యువతి (23) ఎంబీఏ చదువుతోంది. తండ్రి వదిలి వేయడంతో తల్లితో కలిసి తాత ఇంట్లో ఉంటోంది. కాగా, కొద్ది రోజులుగా ఆమె నడుం నొప్పితో బాధపడుతోంది. బోన్ క్యాన్సర్ కావచ్చనే అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న ఆ యువతి గురువారం ట్యాంక్‌బండ్‌కు వచ్చి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు అడ్డుకున్నారు. మరో ఘటనలో...రాజేంద్రనగర్ అత్తాపూర్‌కు చెందిన సీహెచ్ శివరాణి(50) ప్రైవేటు ఆస్పత్రిలో అటెండర్. ఈమె భర్త జీహెచ్ఎంసీలో పనిచేస్తూ 15 ఏళ్ల క్రితం మరణించగా పెద్ద కుమారుడికి అతని ఉద్యోగం ఇచ్చారు. చిన్న కుమారుడు ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. పెద్ద కుమారుడు తనను పట్టించుకోకపోవడంతో శివరాణి చిన్న కుమారుడి దగ్గర ఉంటోంది. అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీనికి తోడు చిన్నకోడలితో ఆమె చిన్నచిన్న విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురవుతున్న శివరాణి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.