రాంగోపాల్‌పేట్: మానసికంగా ఇబ్బంది పడుతూ.. ఆత్మహత్య చేసుకోవాలనిపించే వారికి లేక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బీ ధనలక్ష్మి ధైర్యం చెబుతూ వారికి అండగా నిలుస్తున్నారు. నెక్లెస్‌రోడ్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల రక్షణ, హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకునే వారిని రక్షించేందుకు 2003 లో లేక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన ధనలక్ష్మి తన 16 నెలల కాలంలో 417 మంది ప్రాణాలు కాపాడారు.
24గంటలు లేక్ చుట్టూ సిబ్బందితో పహారా కాస్తూ నిరంతరం వారిని అప్రమత్తం చేస్తూ ఎవ్వరూ హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకోవద్దనే బలమైన ఆశయంతో పనిచేస్తూ, చేయిస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్లు, వృద్ధాప్యంతో ఒంటరితనం భరించలేని వాళ్లు కొందరు ఒక్కొక్కరిది ఒక్కో గాథ అలాంటి వారి బాధలన్నీ పూర్తిగా వినడం సమస్యల్లో నుంచి బయటపడే పరిష్కార మార్గాలు వెదికి చూపించడం చేస్తున్నారు ఇన్‌స్పెక్టర్ ధనలక్ష్మి. మళ్లీ, మళ్లీ చావాలనే బలమైన కోరికతో ఉండే వారిని భరోసా కేంద్రానికి, రోష్నీ కౌన్సిలింగ్ కేంద్రాలకు పంపించి వారి మానసిక పరివర్తనలో పూర్తి మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. కర్తవ్య నిర్వహణతో పాటు ఉద్యోగాల కోసం, వారి ఉపాధి కోసం తన వంతు సాయం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment