ఘనంగా లష్కర్ బోనాలు
- ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
- ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. మహిమాన్విత శక్తిగా, కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహంకాళిని దర్శించుకునేందుకు నగరం నలువైపుల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి వరకూ భక్తులు బోనాలు సమర్పించారు. సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు బోనాలు సమర్పించినట్లు అంచనా. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఉదయం 4.05 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పించి వేడుకలను ప్రారంభించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు సాయంత్రం ఉజ్జయిని మహంకాళిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్ కె.మధుసూదనాచారి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి పద్మారావుగౌడ్ దంపతులు, ఎంపీ కవిత, మల్లారెడ్డి, కె.కేశవరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, సాయన్న, బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, నంది ఎల్లయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఎంపీ కేకే కూతురు విజయలక్ష్మి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రతిసారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వచ్చి పూజలు చేసే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈసారి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన సతీమణి శోభ, కుమార్తె కవితలు మంత్రి పద్మారావు ఇంటి వద్ద నుంచి అమ్మవారి దేవాలయానికి వచ్చారు. అనంతరం మంత్రి ఇంటికి వెళ్లి బోనాల విందులో పాల్గొన్నారు.
ఘనంగా ఏర్పాట్లు...
తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల ఉత్స వాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభు త్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ ఏడాది బోనాల కోసం రూ.10 కోట్లు వెచ్చించిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
నేడు రంగం...
బోనాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం నిర్వహించనున్నారు. అవివాహిత మహిళ స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని దేశ భవిష్యత్‌కు సంబంధించి భవిష్యవాణి వినిపిస్తారు.
దత్తాత్రేయకు చేదు అనుభవం
అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయమే కేంద్ర మంత్రి దత్తాత్రేయ సికింద్రాబాద్‌కు వచ్చారు. అయితే అప్పటికే భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఆయన కాన్వాయ్‌ను ఆలయం వద్దకు వెళ్లకుండా మధ్యలోనే నిలిపివేశారు. దీంతో రాంగోపాల్ పోలీస్‌స్టేషన్ నుంచి ఆలయం వరకు ఆయన సతీమణితో కలసి నడుచుకుంటూ వచ్చారు. పోలీసుల తీరు పట్ల దత్తాత్రేయ అసంతృప్తిని వ్యక్తం చేశారు.