బన్సీలాల్‌పేట్: లష్కర్ బోనాల పండుగ అనగానే కొత్త కుండలో ప్రత్యేకంగా వండిన నైవేద్యం.. డప్పుల దరువులు.. పోతరాజుల వీరంగాలు.. ఫలహారపు బండ్ల ఊరేగింపులు.. రంగం ద్వారా భవిష్యవాణి వినిపించడం.. ఎక్కువగా ఇవే గుర్తుకు వస్తాయి.కానీ.. జాతరలో ప్రతి ఇంటికీ వెళ్లి భక్తులకు దర్శనభాగ్యం కల్పించే ఘటం అత్యంత కీలకమైంది. పొడవైన వెదురు బద్దలతో నిలువెత్తు ఆకారంలో పూలతో అందంగా తీర్చిదిద్ది అందులో అమ్మవారి విగ్రహాన్ని అమర్చి ఆకర్షణీయంగా రూపొందించేదే ఘటం. ఒంటినిండా పసుపు పూసుకున్న వ్యక్తులు ఘటాన్ని అధిరోహించి తలపై ఉన్న ఘటం కిందపడకుండా డప్పుల దరువులకు అనుగుణంగా విన్యాసాలతో నాట్యమాడుతూ భక్తులను ఆశ్చర్యానందాలకు లోను చేస్తుంటారు. సుమారు 60 కిలోల బరువున్న ఘటాన్ని కేవలం పసుపు ముద్ద తలచుట్టకు మధ్యన పెట్టి పడకుండా చూడాల్సి ఉంటుంది. సికింద్రాబాద్‌లో 15కు పైగా ఆలయాలకు సంబంధించిన అమ్మవారి ఘటాలు ఈ రకంగా 13 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాయి.
ఎదుర్కోళ్ల నుంచి జాతర ముగిసే వరకూ..
ఆషాఢమాసం తొలి ఆదివారం ఈ నెల 7న సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉత్సవాల్లో దర్శనమివనుంది. సోమ సుందరం వీధిలోని శ్రీ దేవి పోచమ్మ, కళాసిగూడలోని మాతా ముత్యాలమ్మ, శివాజీనగర్‌లోని డొక్కలమ్మ, రెజిమెంటల్ బజార్‌లోని గండిమైసమ్మ, ఓరుగంటి ఎల్లమ్మ, సెకెండ్ బజార్‌లోని ముత్యాలమ్మ, పీనుగుల మల్లన్న, కుమ్మరిగూడలోని నల్లపోచమ్మ, ఆర్‌పీ రోడ్డులోని మావురాల పెద్దమ్మ వంటి అమ్మవారి ఘటాలు కూడా ఎదుర్కోలు ఉత్సవాల్లో వేర్వేరుగా పాల్గొంటాయి. ప్రధానంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఘటం బోట్స్‌క్లబ్ సమీపంలోని బుద్ధభవన్ ఎదురు సందులో ఉన్న మహంకాళి అనే దేవాలయంలో రూపుదిద్దుకుంటుంది. ఆ తరువాత ఈ నెల 20న శనివారం రాత్రి వరకు ఆయా బస్తీలు, కాలనీల్లో ఊరేగుతూ భక్త జనుల పూజలందుకుంటాయి. 21న ఆదివారం బోనాల పండుగ రోజున ఉజ్జయినీ మహాకాళి మినహా ఇతర ఘ టాలు ఆనకట్ట ఉత్సవాల్లో పాల్గొంటాయి. 22న రంగం కార్యక్రమం ముగిసిన తరువాత అమ్మ వారి ఘటం వీడ్కోలు ఉత్సవంలో పాల్గొంటుంది. దీంతో జాతర పరి సమాప్తమవుతుంది.
ఘటం ఎందుకు మొదలైందంటే..?
తొలినాళ్లలో ఘటం అనేది ఉండేది కాదు. ప్రధానంగా 1813లో సురిటి అప్పయ్య అనే మిలటరీ ఉద్యోగి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతంలో విధులు నిర్వహించే వారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కలారా వ్యాధి తగ్గితే సికింద్రాబాద్‌లో ఆలయాన్ని కడతానని మొక్కుకున్నారు. ఆ తరువాత సికింద్రాబాద్‌లో ఆలయాన్ని నిర్మించారు. అయితే దివ్యాంగులు, వృద్ధులు ఆలయానికి రాలేని వారికి ఇంటి వద్దే అమ్మవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ఘటాన్ని తయారు చేశారు.
ఘటం అధిరోహకుల వేషధారణ
ఘట అధిరోహకులు పసుపులో తడిపిన పంచె ధరించి, ఒంటి నిండా పసుపు పులుముకుని కళ్లకు కాటుక, కాళ్లకు గజ్జెలు ధరించి ఘటాన్ని అధిరోహిస్తుంటారు. అమ్మవారి ఘటాన్ని అధిరోహించే వీరి పట్ల ప్రజలు భక్తి భావాన్ని చాటుకుంటారు. అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించే ఎంతోమంది వైపాకులతో కూడిన చన్నీళ్ల సాకను పెడుతుంటారు.
రేపు గోల్కొండ అమ్మవారికి పాతబస్తీ జోడు బోనం
చార్మినార్: ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఈ నెల 4న, గొల్కొండ జగదాంబికా అమ్మవారికి జోడు బోనాలను సమర్పించనున్నారు. నగరంలోని అమ్మవారి దేవాలయాలతో పాటు విజయవాడలోని కనక దుర్గ అమ్మవార్లకు జోడు బోనాలను సమర్పించనున్నామనీ ఇందులో భాగంగా మొదటి జోడు బోనాన్ని గురువారం జరిగే గొల్కొండ బోనాల జాతర సందర్బంగా అమ్మవారికి సమర్పించనున్నామని కమిటి అధ్యక్షుడు పొటేల్ శ్రీనివాస్ యాదవ్, మాజీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. ఈ సారి బంగారు బోనంతో పాటు వెండి బో నాన్ని కూడా సమర్పించనున్నామన్నారు. గు రువారం ఉదయం 9 గంటలకు పాతబస్తీ బే లాలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జోడు బోనాలతో అంగరంగ వైభవంగా గొల్కొండ కోటకు బయలు దేరుతామన్నారు.
సప్త మాతృకలకు జోడు బోనాలు..
సప్త మాతృకలకు జోడు బోనాలను నగరంలోని గోల్కోండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహినీ దేవాలయం అమ్మవార్లకు బంగారు, వెండి పాత్రలలో సమర్పించనున్నామన్నారు. ఈ నెల 4న, గోల్కోండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే బంగారు,వెండి బోనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 9న బల్కంపేట ఎల్లమ్మ, 12న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 14 విజయవాడ కనకదుర్గ అమ్మవారు, 17న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ దేవాలయం అమ్మవారు, 23న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, 25న లాల్ దర్వాజ సింహవాహినీ దేవాలయం అమ్మవారికి బంగారు, వెండి పాత్రల్లో జోడు బోనాలను సమర్పించనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment