ప్రముఖులకే ప్రాధాన్యం | Common People Suffered With VIP Services in Lashkar Bonalu | Sakshi
Sakshi News home page

ప్రముఖులకే ప్రాధాన్యం

Published Mon, Jul 22 2019 8:45 AM | Last Updated on Thu, Jul 25 2019 1:19 PM

Common People Suffered With VIP Services in Lashkar Bonalu - Sakshi

సనత్‌నగర్‌: సామాన్య భక్తుల విషయంలో అధికారులు ఎప్పటిలాగే వ్యవహరించారు. వీవీఐపీలు, వీఐపీల సేవలో దేవాదాయ శాఖ అధికారులు మునిగి తేలడంతో ఎంతకీ క్యూలైన్‌ కదలక సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, ఇతర రంగాల ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి తోడు జాతరలో విధులు నిర్వర్తించే సిబ్బంది పలుకుబడితో తమ కుటుంబసభ్యులు, బంధువులను వీఐపీ గేటు ద్వారానే పంపించడంతో సామాన్య భక్తుల దర్శనం మరింత ఆలస్యమైందనే చెప్పాలి. వీఐపీ గేటు వద్ద పైరవీకారుల హడావుడి ఎక్కువ కావడంతో ఒకానొక దశలో వారిని కట్టడి చేయ డం పోలీసుల తరం కాలేదు. కేవలం ప్రముఖుల సేవలో మునిగితేలిన అధికారులు సామాన్య భక్తుల దర్శనం ఏవిధంగా జరుగుతుందనే దానిపై దృష్టిసారించలేదు. దీంతో క్యూలైన్లలో పిల్లాపాపలతో పాటు బోనాలను ఎత్తుకుని వచ్చిన మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. గతేడాది తలెత్తిన సమస్యను దృష్టిలో ఉంచుకొని బోనంతో వచ్చిన జోగినిలకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించారు. అటు వీఐపీలు, ఇటు జోగినిల ప్రవేశంతో సామాన్య భక్తుల క్యూలైన్‌ నత్తనడకను తలపించింది.  

ఇదీ పరిస్థితి...
భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని చెబుతున్న పోలీసు అధికారులు కేవలం వీఐపీల సేవలోనే తరించినట్లు కనిపించింది. ఎవరికి వారు రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని రావడంతో పోలీసులు వారికి వీఐపీ దర్శనం కల్పించారు.   
సీఎం, మంత్రులు, ప్రముఖులు వచ్చిన ప్రతిసారీ 10–15 నిమిషాల పాటు సామాన్య భక్తుల దర్శనం ఆగిపోయింది.  
చిన్నారులు, బోనాలతో వచ్చిన మహిళల కోసం సెపరేట్‌ లైన్లు కేటాయించాలని ఆలయ అధికారులు మైక్‌లో పదే పదే చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా గర్భ గుడి ప్రాంగణంలో నాలుగైదు లైన్లలో భక్తులను పంపించడంతో తోపులాటకు దారితీసింది.
తొలిబోనం సమర్పణ సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ట్రస్ట్‌ సభ్యుల కుటుంబాలను అనుమతించలేదు.  
మహంకాళి పోలీస్‌స్టేషన్‌
సమీపంలో వాటర్‌ ప్యాకెట్ల బస్తాలను నిల్వ ఉంచగా భక్తులకు వాటిని అందించడంలో అధికారులు విఫలమయ్యారు.  
లక్షలాది మంది భక్తులు జాతరకు హాజరవుతారని తెలిసి కూడా బయో టాయ్‌లెట్లు, మరుగుదొడ్లను సరిపడా ఏర్పాటు చేయలేదు.   
ప్రముఖులకు ప్రాధాన్యమిచ్చిన పోలీసులు ప్రజాప్రతినిధులను విస్మరించారు. బేగంపేట్‌ కార్పొరేటర్‌ ఉప్పల తరుణి కుటుంబసభ్యులతో కలిసి దర్శనం కోసం రాగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దాదాపు అరగంట రోడ్డుపైనే నిలుచోగా.. కేవలం ఆమెను మాత్రమే లోపలికి పంపించారు.  
దర్శనం దారి తెలియక చాలామంది అవస్థలు పడ్డారు. సాధారణ భక్తులు, పాస్‌ ఉన్నవారు, దివ్యాంగులు, బోనం ఎత్తుకొని వచ్చిన మహిళలు ఏ దారి గుండా ఏ లైన్‌లో వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. అక్కడ వారికి దిశా నిర్దేశం చెప్పేవారు కరువయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement