దేశం విడిచి వెళ్లాలి
అంబేడ్కర్‌ను వ్యతిరేకించేవారికి కిషన్‌రెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆలోచనా విధానానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండేవారు దేశం విడిచి వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కశ్మీర్ కోసం వేలాది మంది బలిదానాలు చేశారని, అలాంటి రాష్ట్రానికి స్వాతంత్య్రం కావాలని నినదించే వారికి దేశంలో ఉండే నైతిక హక్కు లేదన్నారు. దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న జాతి వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా సోమవారం ఇందిరాపార్కు వద్ద బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
ఇందులో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలతో భ్రష్టు పట్టించిందన్నారు. ఉగ్రవాదులకు అనుకూలంగా నినాదాలు చేసిన విద్యార్థులకు రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటిస్తున్నారన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... సరస్వతీ నిలయాలైన వర్సిటీల్లో కొంతమంది విద్యార్థులు దేశాన్ని అస్థిరపర్చే కార్యక్రమాలు నిర్వహించడం గర్హనీయమన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ నేతలు బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి పాల్గొన్నారు.