ఈ విధిత.. విధి వంచిత | leave the husband of his wife ,girl child | Sakshi
Sakshi News home page

ఈ విధిత.. విధి వంచిత

Published Fri, May 1 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

ఈ విధిత.. విధి వంచిత

ఈ విధిత.. విధి వంచిత

ఆడపిల్ల పుట్టిందని గెంటేసిన భర్త
అత్తారింటి వద్ద బాధితురాలు ఆందోళన

 
ముషీరాబాద్:  ఆడపిల్ల పుట్టిందని తనను వేధించారని, చివరకు పిచ్చిపట్టిందని ఇంట్లోంచి గెంటేశారని, నాకు న్యాయం చేయాలని ఓ మహిళ రాంనగర్‌లోని భర్త ఇంటి వద్ద తన కూతురితో కలిసి ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం...వనస్థలిపురానికి చెందిన నర్సాపురం బ్రహ్మచారి, ఉమాదేవిల కూతురు విధితను రాంనగర్‌కు చెందిన అమృత, లక్ష్మీనారాయణ కుమారుడు శశికిరణ్‌కు ఇచ్చి 2010లో పెళ్లి చేశారు. కట్నం కింద రూ. 10 లక్షలు, 25 తులాల బంగారం ఇచ్చారు. బీటెక్ చదివిన విధిత వెబ్ డిజైనింగ్ నేర్చుకొని కూతురు పుట్టే ముందు వరకు ఉద్యోగం చేసింది.

శశికిరణ్ గతంలో ముంబై, బెంగళూరుల్లో సొంతంగా యానిమేషన్ బిజినెస్ చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నీవు మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ నా బిజినెస్‌లో నష్టం వచ్చిందని, నా చెల్లెలు పెళ్లి కావడంలేదని భార్యను వేధించసాగాడు.  విధితకు 2013 సెప్టెంబర్‌లో కూతురు పుట్టింది. కూతురుని చూడటానికి శశికిరణ్ వెళ్లలేదు. ఐదు నెలలైనా భర్త కాపురానికి తీసుకెళ్లకపోవడంతో తల్లిదండ్రులు విధితను  రాంనగర్‌లోని అత్తగారింటిలో విడిచి పెట్టి వెళ్లారు. ఇక అత్తమామలు అమృత, లక్ష్మీనారాయణ , ఆడపడుచులు సూటిపోటీ మాటలతో వేధించడంతో పాటు కొట్టడం చేశారు. దీంతో విధితకు పెరాలసిస్ వచ్చింది.  వైద్యం చేయించుకొనేందుకు తల్లి గారింటికి వెళ్లింది. ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత కూడా భర్త కాపురానికి తీసుకెళ్లకపోవడంతో గురువారం తన ఏడాది పాప వేదను తీసుకొని అత్తగారింటికి రావడంతో కనీసం తలుపులు కూడా తీయలేదు.

దీంతో ఆమె పాపతో ఇంటి ముందే కూర్చొని ఆందోళనకు దిగింది. రాత్రి వరకు కూర్చున్నా అత్తగారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు.  భర్తతో కలిసి ఉంటానని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా భర్త శశికిరణ్ తన చెల్లెలు నిశ్చితార్థం ఉండటంతో పది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉన్నాడు. ఇప్పటికే అతను భార్య నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement